బోరబండలో చెక్కపెట్టెలో అస్థిపంజరం..

హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో అస్తి పంజరం బయటపడ్డ కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న అక్కసుతో ప్రియురాలి భర్తను దారుణంగా చంపిన దుండగుడు ఆ శవాన్ని దేవాలయాల సమూహంలోని సెల్లార్లో అద్దెకుంటున్న గదిలో దాచిపెట్టాడు. ఏడాది క్రితం జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. 2017లో సాయిబాబా గుడి కింద ఉన్నసెల్లార్ ను పలాస పాల్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. ఈ అద్దెతోనే పూజారికి జీతం ఇస్తున్నారు ఆలయ నిర్వాహకులు. అయితే పాల్ 12నెలల నుంచి అద్దె చెల్లించడం లేదు సరికదా అక్కడికి రావడమే మానేశాడు. అద్దె కోసం నిర్వాహకులు ఫోన్‌చేస్తే ఒకసారి రూ.10వేలు, ఇటీవల రూ.5వేలు బ్యాంకు ఖాతాలో వేశాడు. పాల్ ఎంతకీ రాకపోవడంతో ఆలయ అధికారులు గత నెల 28న స్థానికులు, పోలీసుల సమక్షంలో గది తాళం తీశారు. ఆ గదిలో ఉన్న సామగ్రి జాబితా రాసుకొని, గోవర్ధన్ అనే మరో వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. గోవర్ధన్ గదిలోని సామగ్రిని తరలిస్తుండగా, ఓ చెక్కపెట్టెలో మనిషి అస్థిపంజరం కనిపించింది.
పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఈ ఘటన వెనుక పలాస పాల్ హస్తం ఉంటుందని భావించిన పోలీసులు.. అతడు అద్దె చెల్లించిన బ్యాంకు ఖాతా, ఫోన్ కాల్స్ ఆధారంగా ఆచూకీని ట్రేస్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని నిజాల్ని కక్కించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ (35)తో తనకు వివాహేతర సంబంధం ఏర్పడిందని, తమ వ్యవహారానికి ఆమె భర్త కమల్ మైతి అడ్డుగా ఉన్నాడని భావించి గత ఏడాది జనవరి 10న అతడిని తన గదికి తీసుకొచ్చి హత్య చేశానని పాల్ పోలీసుల దర్యాప్తులో అంగీకరించాడు. కాగా మృతదేహాన్ని బయటకు తరలించడం సాధ్యం కాకపోవడంతో పెట్టెలో పెట్టి గదికి తాళంవేసి వెళ్లిపోయాడు. కాగా ఈ కేసులో పాల్ ను పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. దీంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.