భద్రాద్రి జిల్లాలో ముగ్గురు మావోల ఎన్కౌంటర్

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ మేరకు ఎస్పీ సునీల్‌దత్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. చర్లమండలంలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో గల గుట్టల వద్ద రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మావోయిస్టులు.. పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా.. సంఘటనా ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు, మిలీషియన్ కమాండర్ సోడి జోగయ్య మృతదేహం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాల వద్ద ఒక 8 ఎంఎం రైఫిల్, పేలుడుకు ఉపయోగించే సామగ్రి, ఒక కిట్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా.. వారి కోసం కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇరవై రోజుల వ్యవధిలో జరిగిన మూడు ఎన్కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 8కి చేరింది. కాగా ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని ఉల్వనూరు శివారు పాములదున్న గుట్ట అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటనా స్థలంలో ఒక తుపాకీ, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కేఆర్కే ప్రసాదరావు తెలిపారు. అలాగే డ్రోన్ కెమెరాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు గ్రామాలు, అడవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.