ముంబయిలో డేంజరస్ కరోనా మ్యుటేషన్..!

ముంబయి: స్ట్రెయిన్ కొత్త కరోనా వైరస్ లాగే ప్రమాదకరమైన మరో కరోనా మ్యుటేషన్ ఇండియాలోనే కనిపించడం పలువురు వైద్యనిపుణులను ఆందోళన కలిగిస్తోంది. ఈ కొత్త వైరస్ ను ముంబయికి చెందిన ముగ్గురు పేషెంట్ల శాంపిల్స్‌లో ఖర్గార్‌లోని టాటా మెమోరియల్ సెంటర్ కనుగొన్నది. దీనిని E484K మ్యుటేషన్‌గా పిలుస్తున్నారు. సౌతాఫ్రికాలో కనిపించిన మూడు మ్యుటేషన్ల ((K417N, E484K and N501Y)లో ఇదీ ఒకటని ఇక్కడి అసోసియేట్ ప్రొఫెసర్ నిఖిల్ పట్కార్ వెల్లడించారు. మొత్తం 700 శాంపిల్స్‌కు జెనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తుండగా.. అందులో ముగ్గురిలో ఈ మ్యుటేషన్ కనిపించినట్లు చెప్పారు. ఇది శరీరంలోని యాంటీ బాడీస్‌ను బోల్తా కొట్టిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు. నవీ ముంబై, పాన్వెల్, రాయ్‌గడ్‌లలోని కొవిడ్ పేషెంట్ల జెనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తోంది టాటా మొమోరియల్ సెంటర్. ఇప్పుడీ కొత్త మ్యుటేషన్ వచ్చిన పేషెంట్లు గత సెప్టెంబర్‌లో కొవిడ్ బారిన పడినట్లు డాక్టర్ నిఖిల్ పట్కార్ చెప్పారు. వీళ్లకు చాలా స్వల్పమైన లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు కేవలం ఇంట్లోనే క్వారంటైన్లో ఉండగా.. ఒకరు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.