మరో రెండు రోజులు కుండపోత
తెలంగాణకు భారీ వర్ష సూచన ఒకటో నెంబరు హెచ్చరిక జారీ నల్లమలలో కుంగిన రోడ్డు

మరో రెండు రోజులు కుండపోత
తెలంగాణకు భారీ వర్ష సూచన
ఒకటో నెంబరు హెచ్చరిక జారీ
నల్లమలలో కుంగిన రోడ్డు
హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత తీవ్రమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఒకటో నంబరు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయి. శనివారం రాష్ట్రంలో 4.52 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
ఇక ఆది, సోమవారాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో మాట్లాడారు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని, కలెక్టర్, పోలీస్ అధికారులతో కలసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. అలాగే తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి.
మూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 6500 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 245 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 640.7 అడుగుల మేరకు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 3.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి కాలువ నుండి 100 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాలువ నుండి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
నల్లమల్ల అటవీ ప్రాంతంలో కుంగిన రోడ్డు..
ఆమ్రాబాద్ మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి కుంగిపోయింది. ఘాట్‌లలో పలు చోట్ల ప్రహరీ గోడలు కూలిపోయాయి. అయితే రోడ్డు కుంగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయ ఏర్పడింది.
ఎల్ఎండీ రిజర్వాయర్.
కరీంనగర్ః గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతూ వాగుల్లో కలుస్తున్నాయి. వాగులు నిండుగా ప్రవహిస్తూ రిజర్వాయర్లలోకి వచ్చి చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి నీరు భారీగా వచ్చి చేరుతుంది. భారీ వర్షాలతో సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోని పలు మండలాల్లో చెరువులు మత్తళ్లు దూకడంతో నీరంతా మోయతుమ్మెద వాగులో చేరి ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి ప్రవహిస్తోంది.
భారీ వర్షాలతో గ్రామాలు నీట మునిగి అతలాకుతలమవుతున్నాయి. చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతూ వాగుల్లోకి చేరి ప్రవహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్ఎండీ రిజర్వాయర్ లో నీటి మట్టం రోజురోజుకు పెరుగుతుంది. రాష్ర్టంలోని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ లోని పలు ప్రాంతాలకు సాగునీటిని అందించే ఎల్ఎండీ రిజర్వాయర్ సగానికి చేరుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో చెరువులు నిండి మత్తళ్లు దూకుతుండగా… నీరంతా మోయతుమ్మెద వాగులో వచ్చి చేరి నిండుగా ప్రవహిస్తోంది. మోయతుమ్మద వాగు ద్వారా సుమారు యాభై వేలు క్యూసెక్కుల నీరు ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతుంది. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్ఎండీ రిజర్వాయర్ శనివారం సాయంత్రం వరకు 12 టీఎంసీలకు చేరుకుంది. మూడు రోజుల క్రితం 9.47 టీఎంసీల నీరున్న ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి రెండున్నర టీఎంసీల నీరు మూడు రోజుల్లో వచ్చి చేరింది. నీటి ప్రవాహం ఇలాగే ఉంటే రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎల్ఎండీకి నీరు వచ్చి చేరుతుందని ఎస్ఈ శివకుమార్ తెలిపారు. ఈఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఈలు ప్రతీ గంటకోసారి నీటి నిల్వలను పరిశీలిస్తూ సీఎంవో ఆఫీసుకు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాల కారణంగా ఎల్ఎండీ దిగువ ఆయకట్టు రైతుల కోరిక మేరకు నీటి విడుదలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
భారీ వర్షాలపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అనేక చెరువులు అలుగుపోస్తున్నాయి. కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, మంత్రులతో మాట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. తగు సూచనలు చేశారు. హైదరాబాద్ లో రెండు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని స్థానిక కలెక్టర్, పోలీస్ అధికారులతో కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రెండు హెలికాఫ్టర్లను సిద్ధంగా ఉంచింది. వరదల వల్ల చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వాటిని వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాఫ్టర్ తో పాటు సైనిక హెలికాఫ్టర్ కూడా అందుబాటులోకి వచ్చింది.