రజనీ ప్రతిపాదిస్తే.. నాకు ఓకే: కమల్‌హాసన్

చెన్నై: తమిళనాడులో రాజీకీయాలు ఇప్పుడు అంతా సూపర్‌స్టార్ రజినీకాంత్ పెట్టబోయే పార్టీ చుట్టే తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. తమిళనాట ఎవరి నోట విన్నా రజనీ రాజకీయపార్టీ గురించే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రజనీ కోరితే సిఎం అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని ‘మక్కల్ నీది మయ్యం’ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంచీపురం జిల్లాలో ఆయన పర్యటించారు. రజనీకాంత్ పార్టీని స్థాపించినా తాను సిఎం పదవికి పోటీ చేయనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రచారంలో ‘రజనీకాంత్ మిమ్మల్ని సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సిద్ధమేనా?’ అన్న ప్రశ్నకు కమల్‌హాసన్ స్పందిస్తూ.. ‘రజనీకాంత్ తనను సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అంగీకరిస్తానని’ బదులిచ్చారు. డబ్బులు పంచేందుకు ఆసక్తి చూపే ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎందుకు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. ప్రచారంలో భాగంగా చినకాంచీపురంలోని చేనేత కార్మికులను ఆయన కలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు.