రీజిన‌ల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ప‌చ్చ‌జెండా

హైదరాబాద్‌: రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారని ఎంపి నామానాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు అనుమతివ్వాలని కోరుతూ తాను, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర  మంత్రి నితిన్‌ గడ్కరీని కలువగా, ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ చుట్టూ 354 కిలోమీటర్ల పొడవున ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రతిపాదించిన విషయాన్ని నామా ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం సీఎం కేసీఆర్‌ పలు విడతలుగా కేంద్రానికి లేఖలు రాశారని చెప్పారు.  ఈ రోడ్డు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రికి నామా తెలియజేశారు. నాగపూర్‌-హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌, పుణె-హైదరాబాద్‌- విజయవాడ కారిడార్‌లో జాతీయ రహదారి కనెక్టివిటీ ప్రాముఖ్యత పెరుగుతుందని నామా తెలిపారు. అలాగే హైదరాబాద్‌ చుట్టుపక్కల వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే  కోదాడ-ఖమ్మం నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కూడా కేంద్ర స‌ర్కార్‌ ఆమోదం తెలిపిందని నామా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.