వారు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: కరోనా టీకా వేయించుకున్న వారిలో కర్ణాటకలో ఇద్దరు, ఉత్తర ప్రదేశ్‌లో ఒకరు, తెలంగాణలో ఒకరు చనిపోయినట్లుగా రిపోర్ట్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ తెలిపారు. వారి మరణాలకు కరోనా టీకాకు సంబంధం లేదని పోస్ట్‌మార్టం ద్వారా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. బుధవారం నాటికి మొత్తం 7,86,842 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏమీ రిపోర్టు కాలేదని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మరణించిన వ్యక్తి పోస్ట్‌మార్టం రిపోర్టు అందాల్సి ఉందన్నారు.
ఆదిలాబాద్: తెలంగాణలో నిర్మల్ జిల్లా, కుంటాల మండలానికి చెందిన విఠల్ 108 అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంటాల పీహెచ్‌సీలో విఠల్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇక రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. విఠల్ మృతి చెందాడు. అయితే విఠల్ మృతిపై ప్రజా డైరెక్టర్ అప్ పబ్లిక్ హెల్త్ స్పందించారు. గుండెపోటుతో ఆయన మరణించారని ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాక్సిన్ కు సంబందం లేదన్నారు. మరణంపై విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుదవారం ఓ ప్రకటన విడుదల చేశారు.