వెనక నుండి లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి మృతి
పెనుగొండ: అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో లారీని వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టిన ఘటన సోమవారం అర్ధరాతి జరిగింది. ఈ ప్రమదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. ఇందులో ఇద్దరు యువతులు, మరో ఇద్దరు యువకులు ఉన్నారు. కారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
మృతులు రేఖ (21), అంచల్ సింగ్ (21), మహబూబ్ అలం (31), మనోజ్ మిట్టల్ (38) ఉన్నారు. వీరంతా కర్ణాటకలోని యశ్వంత్‌పూర్ నుంచి వస్తున్నట్లు తెలిసింది. కారు కియా పరిశ్రమ గేటు వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయిన లారీని కారు బలంగా ఢీ కొన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసొకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
