వ్యాక్సిన్ విక‌టించింది.. రూ.5 కోట్లు ఇవ్వండి!

సీరంకు కొవిడ్ టీకా వాలంటీరు నోటీసులు

న్యూఢిల్లీ : కరోనా కట్టడి చేసేందుకు కోవిషీల్డ్‌ టీకాను అభివృద్ధి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు (ఎన్‌ఐఐ) ఓ వాలంటీర్‌ లీగల్‌ నోటీసు పంపారు. మూడో దశ ప్రయోగంలో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోగా తనకు తీవ్రమైన తలనొప్పి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో ప్రశ్నలకు సరిగ్గా స్పందించలేకపోయానని చెప్పారు. ఈ విషయాన్ని కంపెనీ బయట పెట్టలేదని అన్నారు. గత నెల 1, 11 తేదీల్లో ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. నోటీసును నవంబర్‌ 21న పంపామని, కంపెనీ స్పందించిన తర్వాత కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని తెలిపారు.

అస‌లేం జ‌రిగిందంటే..
త‌మ కొవిడ్‌-19 టీకా మూడో ద‌శ ప్ర‌యోగాల్లో పాల్గొనేంద‌కు వ‌లెంటీర్లు కావాలంటూ.. రామ‌చంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ ఇచ్చిన ప్ర‌క‌ట‌న మేర‌కు తాను ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. ఐతే త‌మ‌కు ఇచ్చిన స‌మాచార ప‌త్రంలో ఈ విధ‌మైన తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావాలు సంభ‌వించ‌గ‌ల‌వ‌ని హెచ్చ‌రించ‌లేద‌న్నారు. అక్టోబ‌ర్ 1న త‌న‌కు ఈ వ్యాక్సిన్ డోసు ఇచ్చార‌ని.. తొలి ప‌ది రోజులు ఏ స‌మ‌స్య త‌లెత్త‌లేద‌న్నారు. అనంత‌రం అక్టోబ‌రు 11న భ‌రించ‌లేని త‌ల‌నొప్పి, వాంతులు, త‌ల తిర‌గ‌టం త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో త‌న‌కు పైకి లేవ‌ట‌మే క‌ష్ట‌మైంద‌న్నారు. 16 రోజుల చికిత్స అనంత‌రం తాను అక్టోబ‌రు 26న ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన‌ట్లు తెలిపారు. తాను అనుభ‌వించిన యాత‌న‌, భ‌విష్య‌త్తులో త‌లెత్త‌గ‌ల ఆరోగ్య‌స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకుని త‌న‌కు రూ. 5 కోట్ల న‌ష్ట‌ప‌రిహారాన్ని మంజూరు చేయాల‌ని చెన్నైకి చెందిన బాధితుడు కోరుతున్నారు. అంతేకాకుండా స‌ద‌రు టీకా త‌యారీ, పంపిణీ, ప్ర‌యోగాల‌ను కూడా ఆపివేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.