శంకర్‌కు ఇచ్చినట్లే అంద‌రికీ భూములిస్తారా..? : హైకోర్టు

హైదరాబాద్ : టాలీవుడ్ డైరెక్టర్ శంకర్‌కు స్టూడియో నిర్మాణానికై తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన భూములపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఇవాళ జరిగిన ఈ విచారణలో ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. రూ.2.5 కోట్ల భూమిని రూ. 25 లక్షలకే ఎలా కేటాయిస్తారు..? అని సర్కార్‌ను హైకోర్టు ప్రశ్నించింది. హైదరాబాదులో ఇప్పటికే అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఉందని, ఇతర వ్యక్తులకు స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా విలువైన భూములను సినీ ప్రముఖుల పేరు చెప్పి కట్టబెట్టి.. ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదని హైకోర్టు పేర్కొంది. కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని ప్రభుత్వానికి సూచించింది.

కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. కేబినెట్‌ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఏజీ వ్యాఖ్యలతో ఏకీభవించని హైకోర్టు.. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేల మందికి ఇలాగే  ఇస్తారా అని ప్రశ్నించించింది. ఇలా భూ కేటాయింపులు చేసి ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని హైకోర్టు చెప్పుకొచ్చింది. కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని హైకోర్టు తెలిపింది. దీనిపై మరోసారి కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి ఏజీ రెండు వారాల గడువు కోరాగా.. అనుమతించిన న్యాయస్థానం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.