సాగ‌ర్ ఆయ‌క‌ట్టు లిఫ్టుల టెండ‌ర్ల‌కు కెసిఆర్ ఆదేశం

హైద‌రాబాద్ (CLiC2NEWS): నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలన్నారు. ఇటీవల నెల్లికల్లులో శంకుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి, కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలని సీఎం సూచించారు.

వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలువల మరమ్మతులు, వాటి పరిస్థితి, తదితర సాగు నీటి అంశాలపై మంగళవారం ముఖ్య‌మంత్రి ఉన్నతస్థాయి స‌మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిన నేపథ్యంలో వానకాలం సీజన్ ప్రారంభం కాగానే నీటిని ఎత్తిపోసి పైనించి చివరి ఆయకట్టు తుంగతుర్తి దాకా వున్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపుకోవాలని సూచించారు. రోహిణి కార్తె ప్రారంభమయిన నేపథ్యంలో నారుమడి సిద్ధంచేసుకునేందుకు నీరు అందించడానికి ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలన్నారు.

ధాన్యం దిగుబడిలో తెలంగాణ నేడు పంజాబ్ తర్వాత రెండో పెద్ద రాష్ట్రంగా అవతరించింద‌న్నారు. ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తుండడంతో సమృద్ధిగా పంటలు పండిస్తున్నార‌న్నారు. 30 జూన్ వరకు మొదటి దశ చెక్ డ్యాంలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి దుమ్ముగూడెం దాకా అక్టోబర్ నెలాఖరు దాకా నీటి లభ్యత వుంటుందన్నారు.

జేఈల నియామ‌కం..
ఇరిగేషన్ శాఖలో ఒక్కరోజు కూడా ఏ పోస్టు కూడా ఖాళీగా వుండరాదని సీఎం అన్నారు. ఎప్పటికప్పుడు అర్హులకు ప్రమోషన్లు ఇస్తూ ఖాళీలను వెంట వెంటనే భర్తీ చేయాలన్నారు. ఖాళీల నివేదికను తనకు తక్షణమే అందజేయాలని ఈఎన్సీ మురళీధర్ రావును సీఎం ఆదేశించారు.

తూర్పు అదిలాబాద్ లోని మంచిర్యాల, కాగజ్ నగర్, బెల్లంప‌ల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీరందించేందుకు నిర్మాణం చేయబోతున్న లిఫ్టుల కోసం ఆయకట్టు సర్వేను చేపట్టడానికి వాప్కోస్ సంస్థతో సంప్రదింపులు జరుపాలని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు జి. జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి,ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హన్మంత్ షిండే,శానంపూడి సైదిరెడ్డి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.