సింగరేణి కార్మికులకు బోనస్

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తీపి కబురు. యాజమాన్యం లాభాల్లో 28 శాతం బోనస్‌ను కార్మికులకు చెల్లిస్తున్నట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ మంగళవారం ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నికర లాభాలు రూ.993.86 కోట్లు కాగా.. దీనిలో 28శాతం అంటే.. రూ.278.28 కోట్లను సంస్థ ఉద్యోగులకు ఈ నెల 23న పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. సగటున ఒక్కో కార్మికునికి రూ.60,468 చొప్పున లభించనున్నట్టు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో మార్చిలో మినహాయించుకున్న జీతాన్ని కూడా ఈ లాభాల బోనస్‌తో కలిపి కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు వెల్లడించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దసరా పండుగ అడ్వాన్స్ ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఈ నెల 19న ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనున్నట్టు వివరించారు.
కరోనా నేపథ్యంలో కంపెనీ ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 28 శాతం లాభాల బోనస్‌ను చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, దీనికి సింగరేణి కార్మికుల తరఫున కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు 2012-13లో లాభాల వాటా 18 శాతం ఉండగా.. 2013-14కు సంబంధించి సీఎం కేసీఆర్ 20 శాతానికి పెంచారని తెలిపారు. 28 శాతం లాభాల వాటాను ప్రకటించడంతో కోల్‌బెల్ట్ ఏరియా వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు.
2019-20 నికర లాభాలు రూ.993.86 కోట్లు
ఉద్యోగులకు పంపిణీ చేసేది రూ.278.28 కోట్లు
సగటున ఒక్కో కార్మికునికి రూ.60,468
దసరా అడ్వాన్స్ ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున