సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మృతి

 

అమరావతి : టాలీవుడ్‌ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి(74) మరణించారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. రాయలసీమ మాండలికంతో పలు సినిమాల్లో విలనిజం పండించారు. లాక్‌డౌన్‌ విధించిన నాటి నుండి షూటింగులు నిలిచిపోవడంతో గుంటూరులోని తన నివాసంలో ఉంటున్నారు. నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు జయప్రకాశ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కొరిటెపాడు శ్మశానవాటికలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 1946 మే 8న జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి.. రంగస్థల నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టి… రాయలసీమ మాండలీకంతో విలనిజం పండిస్తూ అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. స‌మ‌ర‌సింహా రెడ్డి , ‘జయం మనదేరా’ వంటి ఫ్యాక్షన్‌ సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. చెన్నకేశవరెడ్డి, సీతయ్య, ఛత్రపతి, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, రేసుగుర్రం, మనం, టెంపర్‌, సరైనోడు తదితర సినిమాల్లో నటించారు. మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో చివ‌రిసారిగా క‌నింపించారు.

ఇక విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో జయప్రకాశ్‌రెడ్డి ఏకపాత్రాభినయం చేస్తూ ‘అలెగ్జాండర్’(ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌లైన్‌) పేరుతో ఇటీవల ఓ సినిమాను కూడా నిర్మించారు. జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల సినిమా ప్రముఖులు సంతాపం
తెలిపారు.

ఆయన మృతిపై పలు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జయప్రకాశ్‌రెడ్డి మరణం పరిశ్రమకు తీరని లోటు.

                                                                                                       -ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

 

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల సంతాపం వ్య‌క్తం చేస్తున్నా.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉంది.

– సిఎం కెసిఆర్‌

జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణంతో తెలుగు సినిమా, నాటక రంగం ఓ జెమ్‌ను కోల్పోయింది. దశాబ్దాలుగా ఆయన విలక్షణ నటనతో మనకు అద్భుతమైన సినీ క్షణాలను అందించారు. నా గుండె శోకంతో నిండిపోయింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను –

     -ఎన్‌.చంద్రబాబు నాయుడు

సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. జయప్రకాశ్‌ రెడ్డిగారితో నేను ఆఖరిగా చేసిన సినిమా ఖైదీ నంబర్‌ 150. ఆయన గొప్ప నటుడు “నాటక రంగం నన్ను కన్నతల్లి. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి” అనేవారు. “అందుకే ఇప్పటికీ శని, ఆది వారాల్లో షూటింగ్స్‌ పెట్టుకోనండి. స్జేజ్‌ పెర్ఫామెన్స్‌ ఇస్తుంటాను. మీరెప్పుడైనా రావాలి” అనేవారు. ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

                                                                                                                          – చిరంజీవి

ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను – నందమూరి బాలకృష్ణ

నా స్నేహితుడు జయప్రకాశ్‌ రెడ్డి మరణంతో షాకయ్యాను. నాది, ఆయనది సిల్వర్‌ స్క్రీన్‌పై అద్భుతమైన కాంబినేషన్‌. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం

– వెంకటేశ్‌

జయప్రకాష్ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాష్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. పదిమందికి సహాయం చెయ్యాలనే వ్యక్తి తను. జయప్రకాష్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధున్ని కోరుకుంటున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను

– మంచు మోహన్ బాబు

ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం ఎంతో బాధాకరం. ఆయన చేసిన ప్రతి పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. సమరసింహారెడ్డి చిత్రంలో విలన్‌గా అద్భుతంగా నటించారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను

– నారా లోకేశ్‌

జయప్రకాశ్‌ రెడ్డిగారు చనిపోవడం చాలా బాధాకరం. అయనొక అద్భుతమై నటుడు, కమెడియన్‌. ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలను మరచిపోలేను. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను

– మహేశ్‌

అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

– తారక్‌

జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణవార్తలను తెలియగానే షాకయ్యాను. మనసంతా బాధతో నిండిపోయింది. ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలెంతో గొప్పవి. దశాబ్దాలుగా విలన్‌, కామెడీ పాత్రలో ఆయన మనల్ని ఎంటర్‌టైన్‌ చేసినందుకు ఆయనకు థాంక్స్‌. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

– ఎస్‌.ఎస్‌.రాజమౌళి

సహచర నటుడు జయప్రకాష్ రెడ్డి గారు హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను. మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసినందుకు ధన్యవాదాలు

– ప్రకాశ్‌ రాజ్‌

ప్రియమైన జయప్రకాశ్‌ రెడ్డిగారు మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసినందుకు ధన్యవాదాలు. నేను రెఢీ సెట్‌లో మిమ్మల్ని కలిసి నప్పుడు ఆశ్చర్యపోయాను. మీ ఆత్మకు శాంతి కలగాలి

– రామ్‌ పోతినేని

మై డియర్‌ అంకుల్‌. నా కెరీర్‌ ప్రారంభం నుండి మీరు నాకు తెలుసు. మీరు నాపై చూపించిన ప్రేమ, వాత్సల్యం నేనెప్పటికీ మరచిపోలేను. ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చేసేవారు. నాతో ఫోన్‌లో మాట్లాడిన ప్రతీసారి.. నాన్న నువ్వు, నేను సినిమా రంగానికి చెందినవాళ్లం అని చెప్పేవారు. మీ మాటలు నాకెప్పటికీ గుర్తే. అది మీ ఆశీర్వాదంగా భావిస్తాను. మీ ఆత్మకు శాంతి కలగాలి

– శ్రీనువైట్ల

మేమందరం జేపీ అని పిలుచుకునే జయప్రకాశ్‌ రెడ్డి, తను సడెన్‌గా కన్నుమూయారనడం చాలా దారుణమైన వార్త. చాలా డీప్‌ షాక్‌లో ఉన్నాం. నాటక రంగం నుండి సినీ రంగానికి వచ్చిన జేపీ తనకంటూ ఓ బాణీని క్రియేట్‌ చేసుకున్నారు. భయంకరమైన విలన్‌గానే కాదు.. అద్భుతమైన కమెడియన్‌గా పాత్రలను అద్భుతంగా పోషించారు. అద్భుతమైన నటుడ్ని కోల్పోవడంతో మనసంతా చాలా బాధాకరంగా ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలోనూ కుజాలు చెంబులైపోతాయంటూ ఆయన అద్భుతమైన రోల్‌ చేశారు. పాత్ర నిడివి ఎంతని కాదు.. ఆయన తన నటనతో మనకు గుర్తుండిపోతారు. ప్రత్యేకమైన నటుడు. నన్ను ప్రసాదూ.. అని పిలిచేవాడు. ఆయన మనకు దూరం కావడం డీప్‌ షాక్‌గా ఉంది.

– రాజేంద్రప్రసాద్‌

బాధాకరమైన వార్తతో నిద్ర లేచాను. మీ ఆత్మకు శాంతి కలగాలి

– సుధీర్‌ బాబు

జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం తీరని లోటు, ఎంతో బాధాకరం. చనిపోతున్న మన నాటకరంగానికి ఎంతో సేవ చేశారు. అద్భుతమైన జ్ఞాపకాలను అందించారు. వ్యక్తిగా ఆయనెంతో గొప్పవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి

– దేవా కట్టా

విలక్షణ నటుడు జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం ఎంతో బాధను కలిగించింది. నేను టీవీలో వర్క్‌ చేస్తున్నప్పుడు ఆయన్ని ఇమిటేట్‌ చేయడానికి ప్రయత్నించేదాన్ని. ఆయన ఆత్మకు శాంతి కలగాలి –

అనసూయ

జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం తెలుగు సినిమాకు తీరని లోటు

– ప్రణీతా సుభాష్‌

జయప్రకాశ్‌ రెడ్డిగారి ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను

– బండ్ల గణేశ్‌

నేను, అశోక్‌కుమార్‌గారు, సత్యప్రకాశ్‌గారు, జేపీగారు కలిసి జయంమనదేరా సినిమాకు కలిసి పనిచేసినప్పుడు ఏర్పడిన అనుబంధంతో ఆయన్ని డాడీ అని పిలిచేవాళ్లం. తెలుగు ఇండస్ట్రీ మంచి నటుడ్ని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నాను

– బెనర్జీ

మా ప్రియమైన స్నేహితుడు జయప్రకాశ్‌ రెడ్డి సుదూరలోకాలకు వెళ్లారనే వార్తలో నిద్రలేవడం బాధాకరం. బ్రహ్మపుత్రుడు, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం..రా ఇలా నటుడిగా ప్రతి సినిమాతో మీరెంతో పేరు తెచ్చుకుని అందరి అభిమానానికి పాత్రలయ్యారు. మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నాం

– సురేష్‌ ప్రొడక్షన్స్‌

జయప్రకాశ్‌ రెడ్డిగారి ఆకస్మిక మరణ వార్త విని షాకయ్యాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం

– డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌

జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి

– మైత్రీ మూవీ మేకర్స్‌

విలక్షణ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం

– 14 రీల్స్‌ ప్లస్‌

గ్రేట్‌, టాలెంటెడ్‌ యాక్టర్‌ జయప్రకాశ్‌రెడ్డిగారి మరణం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి

– సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌

Leave A Reply

Your email address will not be published.