సోనియా గాంధీకి 23 మంది సీనియర్ల లేఖ

సోనియా గాంధీకి 23 మంది సీనియర్ల లేఖ
న్యూఢిల్లీ : సీడబ్ల్యూసీ సమావేశానికి ఒక్క రోజు ముందు కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు పార్టీని కాపాడడానికి సోనియాగాంధీనే దిక్కు అన్న నేతలు ఇప్పుడు ఆమె తప్పుకోవాలని అంటున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో వంద మంది కాంగ్రెస్ నేతలు నాయకత్వం మార్పిడి జరగాలని కోరారు. నాయకత్వం యాక్టివ్ గా లేకపోవడంవల్లే పార్టీ నష్టపోయిందని వారు అభిప్రాయపడ్డారు. వెంటనే నాయకత్వాన్ని మార్చి, పార్టీని బలోపేతం చేయాలని వారు కోరారు.
ప్రస్తుత నాయకత్వాన్ని మార్చాలంటూ 23 మంది సీనియర్ల బృందం ఏకంగా తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. నాయకత్వాన్ని మార్చడంతో పాటు పార్టీని పూర్తి ప్రక్షాళన చేయాలని కూడా ఆ బృందం డిమాండ్ చేసింది. పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షునితో పాటు దూర దృష్టి, క్రియాశీలకంగా ఉండే అధ్యక్షుడు ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా పార్టీకి పునరుజ్జీవం పోయడానికి, మార్గదర్శనం చేయడానికి సంస్థాగత యంత్రాంగాన్ని కూడా అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిందేనని సోనియాకు సూచించారు. 23 మంది సీనియర్ల బృందంలో కపిల్ సిబాల్, భూపేందర్ సింగ్ హుడా, పృథ్విరాజ్ చవాన్, శశిథరూర్, మిలిందర్ దేవరా, జితిన్ ప్రసాద తదితరులున్నారు. అయితే గతంలోనే ఈ వార్తలు బయటికి పొక్కినా.. ఆ సీనియర్లు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు.
కాగా కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ భేటీ సోమవారం జరగనుంది. నాయకత్వ ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పార్లమెంట్ సమావేశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కూడా చర్చల జాబితాలో చేర్చినా… ముఖ్యంగా అధ్యక్ష బాధ్యతల చుట్టూనే ఈ సమావేశం సాగనుంది. కాంగ్రెస్ లోని ఓ వర్గం సోనియానే కొనసాగాలని సూచిస్తున్నారు. చూడాలి ఇక ఒక రోజు ఆగితే ఈ ఉత్కంఠకు తెరపడుతుంది.