స్త్రీ, పురుషులకు ఉపయోగకరమైన త్రికోణాసనం

గత ఆదివారం (07-02-2021) నాడు వీక్షకుల కోసం మన `క్లిక్2న్యూస్`లో 39 ఆసనాలను తెలియజేశాము. (షేక్.బహర్ అలీ: శిశిర ఋతువులో చక్కటి ఆరోగ్యానికి..) శిశిర ఋతువులో శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచుకువటానికి, శరీరం తేలికగా ఉండటానికి, ఉదయం నుండి రాత్రి నిదుర పోయేవరకు హుషారుగా ఉండటానికి, శారీరక, మానసిక, ఒత్తిడి నుండి విముక్తి చెంది చక్కని నిద్ర పట్టటానికి, నిత్యం యవ్వనవంతులుగా ఉండటానికి..ఈ 39 ఆసనాలు చాలా అవసరం. వీటిని గత వారంలో అంటే ఆదివారం ఆసనాలు తెలిపినాము. వీటిలో కొన్ని ఆసనాలు చేసినా ఆరోగ్యంగా వుంటారు. ఈ ఆసనాలను నేను మీవద్దకు వచ్చి చెప్పలేను… కావున ఈ రోజు (11-02-2021) నుండి రోజుకు ఒకటి చొప్పున ప్రతిరోజు.. 39 రోజులు.. 39 ఆసనాలను మీ కోసం విశ్లేషిస్తాను.. వీక్షకులంతా అవి చదివి మీరు మీ ఇంట్లోనే, చక్కగా చేసుకోగలరు.
త్రికోణాసనం:
చేయువిధానం:
ఈ ఆసనం ఆకృతి త్రికోణంగా ఉంటుంది. గనుక దీనిని త్రికోణాసనం అని అన్నారు.
ముందుగా తెల్లవారుజామున కాలకృత్యములు చేసుకొని ఒక గ్లాస్ నీరు తాగి 5 నిమిషాలు అగిన తరువాత ఈ ఆసనం చేయాలి.
1. ఆసన స్థితిలో నిలబడుము.
2. కుడి పాదమును, ఎడమ పదము నుండి ఒక మీటరు దూరం ఉంచుము. రెండు చేతులను నెమ్మదిగా ప్రక్కలకు సమానమైన స్థితిలోనికి వచ్చు వరకు పైకెత్తుము. ఊపిరిని పీల్చుము.
3 చేతులు రెండు ఒకే వరసలో ఉంచుము. కుడి పక్కకు వంగెటపుడు శ్వాసను వదులుతూ వంగాలి. కుడి చేతి వేళ్ళు కుడి పాదమును తాకవలెను. ఎడమ చేయ్యి ఐదు వేళ్ళు తిన్నగా ఆకాశం వైపు చూపుము. ఎడమ అర చెయ్యి ముందుకు తిరిగి యుండును.
4. కొద్దిసేపు అటులనే ఉండాలి. మరల నిటారుగా నిలబడేటపుడు శ్వాసను తీసుకుంటూ నిలబడాలి. ఎడమ వైపు అలానే చెయ్యాలి.
ఈ అసనము వలన ప్రయోజనాలు:
1. పిక్కలు, తుంటి కండరములు పుష్టికరం చేయును.వీపు నొప్పి నివారించును. గూనిని చక్కపరుచును. వక్షము వికాసముగా నొనర్చును.
2. కుడి ఎడమ పక్కల పేరుకున్న కొవ్వు కరుగును
3. శరీరం తేలికగా ఉంటుంది. వెన్నుముకతో పాటు పక్కనున్న కండరాలు బలపడతాయి. కాళ్ళు, చేతులు, వీపు, మెడ అన్ని బలంగా ఉంటాయి.
4. పురుషులకే కాదు, స్త్రీలకు కూడా ఈ ఆసనం చాలా లాభకారి.
5 పొత్తి కడుపులో అవయవాలన్ని చురుకుగా ఉంటాయి.
6. శరీరంలో వంకర్లు దూరం అవుతాయి.
7. గుండె, ఊపిరితిత్తులు, పెంక్రియాజ్, పెద్ద పేగులు దీని వలన ప్రభావితమౌతాయి.
8. ఊపిరితిత్తులలోని ఎక్కువ సేపు గాలిని అపగలిగే శక్తి వస్తుంది.
ధ్యానకేంద్రం ..మణిపూర చక్రం.
-షేక్.బహర్ అలీ.
యోగాచార్యుడు.