సరిహద్దులో పరీక్షిస్తే.. దీటైన జవాబు తప్పదు
పాక్, చైనాకు మోడీ పరోక్ష హెచ్చరికలు... జవాన్లతో ప్రధాని దీపావళి వేడుకలు

న్యూఢిల్లీ : దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సరిహద్దు జవాన్లతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దీపావళి పండగ జరుపుకొన్నారు. ఈ ఉదయం సైనికులతో దీపావళి జరుపుకునేందుకు ప్రధాని మోడీ నేడు రాజస్థాన్ సరిహద్దులోని లొంగెవాలా పోస్టుకు చేరుకున్నారు. 2014లో ప్రధానిగా అధికారం చేపట్టిన నాటి నుండి ప్రతి ఏడాది దీపావళి వేడుకలను మోడీ సరిహద్దులోని సైనికులతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనాకు మోడీ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. భారత సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదని హెచ్చరించారు.
విస్తరణవాద శక్తులకు గట్టిగా బదులిస్తాం
`విస్తరణ వాదం అనేది ఒక మానసిక వ్యాధి. వారింకా 18వ శతాబ్దపు భావజాలంతోనే ఉన్నారు. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విస్తరణ వాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ వ్యూహం స్పంష్టంగా ఉంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తుంది. అయితే మనల్ని పరీక్షిస్తే మాత్రం దీటైన జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు భారత్ శ్రతుదేశంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను వారి నాయకులను హతమార్చింది. దేశ సమగ్రతపై ఎన్నడూ రాజీలేదు` అని అన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) డిజి. రాకేష్ ఆస్థానా, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం. నరవణే, డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్‌లు ప్రధానితో పాటు ఉన్నారు. ప్రధాని మోడీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ప్రకాశం, సంతోషాలను కలిగించాలని అన్నారు. అందరూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధానీ మోడీ ట్వీట్ చేశారు. మన్‌కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన ఆడియోను పోస్ట్ చేశారు. దేశం కోసం పోరాడుతున్న సైనికులకు వందనం చూస్తూ.. ప్రతి పౌరుడు ఒక దివ్వెను వెలిగించాలంటూ అక్టోబర్ 25న చెప్పిన క్లిప్పింగ్‌ను మరోసారి పోస్ట్ చేశారు. 1971లో జరిగిన లాంగ్వెలా యుద్ధం అనంతరం ఇక్కడ ఒక సైనికుల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
India is proud of our forces, who protect our nation courageously. https://t.co/3VyP0WusDf
— Narendra Modi (@narendramodi) November 14, 2020