సరిహద్దుల నుంచి వెళ్లిపోండి: చైనాకు చెప్పిన భారత్

మాస్కో: సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణమంత్రి వెయ్ ఫెంఝెలు మాస్కోలో 2 గంటలకు పైగా సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ( ఎస్‌ఓసీ) మంత్రుల స్థాయి సమావేశంలో సరిహద్దు అంశాన్ని రాజ్‌నాథ్‌సింగ్ లేవనెత్తారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. లద్దాఖ్‌లో ఇరుదేశాల మధ్య ఘర్షణలు మొదలయ్యాక ఇప్పటి వరకు సైనిక ఉన్నతాధికారుల మధ్య మాత్రమే ఇప్పటి వరకు చర్చలు జరిగాయి. అత్యున్నత స్థాయి రాజకీయ నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి.
సరిహద్దుల్లో చైనా దురుసుతనంపై ఈ భేటీలో భారత్ తీవ్రస్థాయిలో నిరసన తెలిపింది. ఘర్షణలకు ముందు ఉన్నస్థితిని కొనసాగించాలని, బలగాల్ని త్వరగా ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
కొద్ది వారాల కిందట భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సమావేశంలో మే నెలకు ముందున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. అయితే చైనా మాత్రం భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించింది. చిన్న భూభాగాన్ని కూడా వదలుకోవడానికి చైనా సిద్ధంగా లేదని ఫెంఘే తెలిపారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకోవడానికి భారత్ ముందడుగు వేయాలని అన్నారు.
అంతకు ముందు ఎస్‌సీవో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రాజ్‌నాథ్ దురుసుతనాన్ని వీడాలని చైనాకు పరోక్ష హితబోధ చేశారు.