హత్రాస్ కేసు: ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు

లక్నో: హత్రాస్ దారుణానికి వ్యతిరేకంగా ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా చెలరేగిన నిరసనల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం హత్రాస్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనలో పోలీసులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దాంతో యూపీ ప్రభుత్వం హత్రాస్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. దీనిపై దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక నివేదిక ఆధారంగా దుర్వినియోగ ఆరోపణలపై వీరిని సస్పెండ్ చేసినట్లు తెలిపింది. నిందితులతో సహా బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సిట్ బృందం కోరింది.
సెప్టెంబర్ 14వ తేదీన 20 ఏళ్ల యువతిని పంట పొలాల్లోకి తీసుకెళ్లి.. నాలుక కోసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఈ మంగళవారం మరణించింది. ఆమె మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. దీనిపై కూడా విమర్శలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక హత్రాస్ దారుణానికి వ్యతిరేకంగా ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాల్లో నిరసనలు చెలరేగాయి. వీటిలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భీమ్ ఆర్మీ చీష్ చంద్ర శేఖర్ ఆజాద్ పాల్గొన్నారు. దోషులను ఉరితీయాలని.. యూపీ సీఎం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇక ఇందుకు సంబంధించి అలహాబాద్ హై కోర్టు యూపీ అధికారులకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపి ప్రభుత్వం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది.