హీరోయిన్లు మరణిస్తే… దర్యాప్తు ఇలానే జరిగిందా?: విజయశాంతి

సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.. రోజురోజుకి ఈ కేసు ఎన్నో మ‌లుపులు తిరుగుతోంది. పైగా ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌ముఖ బాలీవుడ్‌, టాలీవుడ్ న‌టులు ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ స్పందిస్తూనే ఉన్నారు. ఈ వ్య‌వ‌హారంపై మీడియాలో చ‌ర్చలు జోరుగానే సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో విజ‌య‌శాంతి త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మం ద్వారా స్పందించారు. ‘బాలీవుడ్ న‌టుడు సుశాంత్ ఆత్మహత్యలో నిజానిజాలు వెలికితీసేందుకు గ‌వ‌ర్న‌మెంటు గట్టి ప్రయత్నాలే చేస్తుంది.’ అన్నారు ప్ర‌ముఖ న‌టి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. ‘దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ… మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు… దర్యాప్తులు జరిగాయా? చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది.  తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా… వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి’’ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.