హుజూరాబాద్ ప్రజల్ని ఎవరూ కొనలేరు: ఈటల
హుజూరాబాద్ (CLiC2NEWS): తన బొందిలో ప్రాణమున్నంత వరకూ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నాగార్జునసాగర్‌లో గెలిచినట్లు ఇక్కడా చేస్తామంటే ప్రజలు పాతరేస్తారని టిఆర్ ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హుజురాబాద్ లో ఈటల మీడియాతో మాట్లాడుతూ… “ నాపై కక్షపూరితంగా వ్యవహరించొచ్చు కానీ మా ప్రజల్ని మాత్రం వేధించే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఒక్క రోజైనా ఇక్కడి వారి బాధను పంచుకున్న వారా? ఇక్కడ ఎవరి గెలుపులో అయినా మీరు సాయం చేశారా ? తోడేళ్ళలా దాడులు చేస్తున్నారు. హుజురాబాద్ ప్రజలను వేధిస్తున్నవు. బిల్లులు రావు అని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. కరీంనగర్ ను బొందల గడ్డ చేస్తున్నావు. 2023 తరువాత టిఆర్ ఎస్‌కు అధికారం ఉండదు. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారో అదే నీకు పునరావృతం అవుతుంది. అదే గతి మీకు పడుతుంది. ప్రజలు అమాయకులు కారు. సంస్కారం తో మర్యాద పాటిస్తున్న.ప్రజల హృదయాలనే గుడులుగా భావిస్తా. ఆపదలో ఉంటే ఆదుకునే ప్రయత్నం చేస్తుంటా. తల్లిని, బిడ్డను వేరు చేసే ప్రయత్నం చెల్లదు. స్థానిక నేతలను ప్రలోభపెడితే తాత్కాలికంగా మీకు జై కొట్టవచ్చు.. కానీ వారి హృదయాలు ఘోషిస్తున్నాయి. దాదాగిరి పద్ధతి, హెచ్చరికలను ఆపకపోతే కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి ఉంటుంది.“ అని ఈటల హెచ్చరించారు.