అంత్యక్రియలు చేస్తుండగా కళ్లు తెరిచింది..

వాషింగ్టన్‌: అంతా ఆశ్చ‌ర్యం!! నిజ‌మే అక్క‌డున్న‌వారంతా అవాక్క‌య్యారు.. ఇది నిజ‌మేనా అని వారిని వారే న‌మ్మ‌లేక‌పోయారు. అస‌లేం జ‌రుగుతుందో తెలియ‌క కొంద‌రు భయ‌బ్రాంతుల‌కు కూడా లోన‌య్యారు. చ‌చ్చిపోయిన వారికోసం శ్మశానానికి వ‌స్తే చ‌చ్చేలా ఉన్నా‌మ‌నుకున్నారు… వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ 20 ఏళ్ల యువతి చనిపోయింది. ఈ విషయాన్ని వైద్యులు కూడా నిర్ధారించారు. దాదాపు 30 నిమిషాల పాటు సీపీఆర్, ఇత‌ర ప్రక్రియలను నిర్వహించారు. శ్వాస ఆడ‌క‌పోవ‌డం, గ‌త హెల్త్ రిపోర్ట్‌ల ఆధారంగా వారు ఆమె మ‌ర‌ణించిన‌ట్లు నిర్ణయానికి వ‌చ్చారు. కానీ పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బంధువులు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేయబోయారు. ఉన్నట్టుండి ఆ శరీరంలో కదలికలు మొదలయ్యాయి. కొద్ది సేపటికి కళ్లు కూడా తెరిచింది. అంతే.. అక్కడున్న కొందరిలో భయం పట్టుకుంటే.. తల్లిదండ్రులు మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ ఘటన అమెరికాలోని డెట్రాయిట్‌లో వెలుగుచూసింది. ఇంతకీ అస‌లు ఏం జరిగిందంటే..! డెట్రాయిట్‌కు చెందిన తిమేష బ్యూచాంప్‌ అనే 20 ఏళ్ల మహిళ మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం తల్లిదండ్రులు చేర్పించారు. సోమవారం ఉన్నట్టుండి ఆమెలో ఎటువంటి కదలికలూ కనిపించలేదు. దాంతో ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని అప్పగించారు. డెట్రాయిట్‌లోని జేమ్్స‌కోల్ శ్మ‌శాన‌వాటిక‌కు తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తుండగా హఠాత్తుగా తిమేష శ్వాస తీసుకుంది. గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది. శరీరంలో కదలికలు కనపడ్డాయి. కళ్లు కూడా తెరిచింది. దాంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ మ‌హిళ పేరును మాత్రం అధికారులు వెల్లడించ‌లేదు. ఆసుపత్రి సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఆమె పల్స్‌రేటు బాగుందని, ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ కూడా బాగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. చనిపోయిందనుకున్న తమ కూతురు మళ్లీ బతకడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.