అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్

హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువులను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌తో బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయన్నారు. హైదరాబాద్‌లోని అన్ని చెరువులు పూర్తిగా నిండాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులకు గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు.