అమ్మేసి, పేరు మారకపోయినా నమోదు వద్దు!

హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్ నమోదులో తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఇండ్లను ఆన్‌లైన్ చేసే టీఎస్‌ఎన్‌పీబీ యాప్‌లో కొత్త కాలమ్స్‌ను చేర్చింది. యాజమాని మరణిస్తే.. డెత్, వేరే వారికి విక్రయిస్తే.. సోల్డ్ అవుట్, వలస వెళ్తే.. నాట్ అవేలేబుల్ అని నమోదు చేస్తే సరిపోతుంది. తదుపరి ఎలాంటి వివరాలు అవసరం ఉండవు. రికార్డుల్లో పేరు ఉన్న ఇంటి యాజమాని చనిపోయినా, లేక వేరేవారికి విక్రయించినా (పేరు మార్పిడి జరగకుంటే) ఆ ఇంటిని ఆన్‌లైన్ చేయొద్దని అధికారులను ఆదేశించింది. విదేశాలకు వలస వెళ్లినవారి ఇండ్లను వదిలేయాలని స్పష్టంచేసింది. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయ్యాక ఇలాంటి ఆస్తులను ఏం చేయాలో స్పష్టత ఇస్తామని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు సోమవారం డీపీవోలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. అలాగే వివాదాస్పదమైన ఇండ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారసులు ఎక్కువమంది ఉండి, వారిలో ఒక్కరి పేరు మీదే ఇల్లు రికార్డుల్లో ఉంటే వాటిని కూడా ఆన్‌లైన్ చేయొద్దని, ఇప్పటికే చేసి ఉంటే పెండింగ్‌లో పెట్టాలని ఆదేశించారు. మ్యుటేషన్ చేసుకున్నాకే నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.