ఆక్లాండ్ లో వైభవంగా బంగారు బతుకమ్మ సంబరాలు
ప్రపంచలోని తూర్పు దిక్కున ఒక చిన్న ద్వీపం.. అక్కడే అందరికంటే ముందు తొలిపొద్దు పొడుస్తుంది. అయినా అక్కడ తెలుగువారు చాలా మందే ఉన్నారు. అందులోనూ తెలంగాణ వారి సంఖ్య కూడా ఎక్కువే. అందుకు ఉదాహరణగా గత కొన్నేళ్లుగా ఇక్కడ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వీరిని ప్రోత్సహిస్తూ ఒక సంవత్సరం ఆ దేశ ప్రధాని జెసిందా కూడా వచ్చి బతుకమ్మ ఆడి, వీరిని అభినందించారు. ఒకప్పుడు తెలంగాణ గడ్డపైనే అవమానాలు ఎదుర్కొన్న బతుకమ్మ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తలెత్తుకొని తిరుగుతోంది. ఇది శుభ సూచకం.
సుమారు ఐదు దశాబ్దాలు దాటింది. తెలంగాణలో మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగకు ఎక్కడికీ వెళ్లే అవహేశం రాలేదు. ఉద్యోగంలో ఉండగా సెలవు ఉండేది కాదు. అంతకు ముందు వలసవాదుల హేళనల నేపథ్యంలో పండుగనే జరుపుకునే పరిస్థితి ఉండేది కాదు. మా ఊళ్ళో బాల్య జ్ఞాపకాలు మినహా ఏమీ లేవు. కానీ ఇప్పుడు నేను న్యూజిలాండ్ లో ఉన్నందున బంగారు బతుకమ్మ పండుగ రోజు `తెలంగాణ జాగృతి న్యూజిలాండ్`లో నిర్వహించిన వేడుకలకు వెళ్లడం మరో ఒక మంచి అనుభూతిని అందించింది. ఇక్కడ కరోనా ప్రభావం అంతగా లేనందున అందరూ బతుకమ్మలతో ఆనందంగా వచ్చారు. భారత్ లోని ఇతర రాష్ట్రాల వారు ఈ కార్యక్రమానికి వచ్చి అభినందించారు. మరాఠా, తమిళ, గుజరాతీ, పంజాబీ వాళ్ళు కూడా వచ్చారు. స్థానిక పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక రాధాకృష్ణన్ తోపాటు మరో ఇతర పెద్దలు వచ్చారు. ఇటీవల భారీ మెజారిటీ తో ఎన్నికైన న్యూజిలాండ్ ప్రధాని జేసిందా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తమ సందేశాలను పంపారు. సుమారు మూడు గంటల పాటు బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేసారు. ఈ సందర్భంగా వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. సాయంకాలం భోజనం తరువాత అందరూ ఇంటిముఖం పట్టారు. ప్రధానంగా చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
–టి.వేదాంత సూరి
[…] […]