ఆట బొమ్మలను మనమే తయారు చేసుకుందాం
అందరూ స్వదేశీ యాప్‌లను వాడాలి: మోదీ

న్యూఢిల్లీ : దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, పిల్లలు ఆడుకునే ఆట బమ్మలను దేశీయంగా మనమే తయారు చేసుకుందామని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం మన కీ బాత్`లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ రైతులపై ప్రశంసలు కురిపించారు. కరోనా విళయతాండవం చేస్తున్న సమయంలోనూ రైతులు ఏమాత్రం విశ్రాంతి లేకుండా కష్టపడి పంటలు పండించి దేశ ప్రజల ఆకలి తీరుస్తున్నారని కొనియాడారు. కరోనా సంక్షోభంలోనూ ఈ ఖరీఫ్‌లో గతేడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారన్నారు. ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని చెప్పారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను ప్రపంచస్థాయిలో తయారు చేయాలని, స్థానిక కళలు, కళాకారులను ప్రోత్సహించాలన్నారు. ఓనం వేడుక ప్రత్యేకత ప్రపంచం నలుమూలలకు విస్తరించిందని తెలిపారు. పిల్లలు ఆడుకునే బమ్మలను తయారు చేయడానికి యువత ముందుకు రావాలని కోరారు. ఆటబమ్మలు వినోదాన్ని నింపడమే కాకుండా పిల్లల్లో ఆలోచనలను కలగజేస్తాయన్నారు. ‘సంపూర్ణంగా లేని ఆటబమ్మలే నిజమైన బమ్మలు’ అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన కొన్ని మాటల్ని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు. మన దేశంలో ఉన్న ఆటలపై పాశ్చాత్య ప్రభావం ఉందని, మన దేశ సంస్కృతికి తగ్గట్టుగా ఆటల్ని రూపొందించాలని కోరారు. కళలు, కళాకారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.