ఆలయానికి 20 కేజీల బంగారం విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ
గుహవాటి : దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ దేశంలోని ప్రముఖ దేవాలయానికి 20 కేజీల బంగారం విరాళంగా ఇచ్చారు. అస్సాంలోని ప్రముఖ దేవాలయమైన కామాఖ్యాదేవి ఆలయం గోపురాలు, పైకప్పుకు తాపడం పనులు చేయిస్తున్నారు. దీపావళి పండుగ రోజున బంగారాన్ని అలంకరించనున్నారు. భారత దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో కామాఖ్యా దేవి ఆలయం కూడా ఒకటి. అయితే ఆలయానికి బంగారు తాపడం పనులు చేసేందుకు సుమారు మూడు నెలల క్రితం అంబానీ కామాఖ్యా ఆలయ నిర్వహణ కమిటీని సంప్రదించారు.
ఈ సందర్భంగా ఆలయానికి చెందిన బోర్ డోలోయి మోహిత్ చంద్ర మాట్లాడుతూ ఇప్పటికే రాతి మట్టిపై రాగి పొర పని పూర్తయిందని, దీపావళికి ముందే బంగారం తాపడం పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అంబానీ దంపతులు ఆలయాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.