ఆలుగడ్డ సాగుపై రైతుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామానికి చెందిన ఆలుగడ్డ రైతు నాగేశ్వర్‌రెడ్డితో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. ఎంత విస్తీర్ణంలో పంట సాగు, ఎకరానికి విత్తన ఖర్చు, ఏ రకమైన విత్తనాలు, పంట కాలం, దిగుబడులు, మార్కెట్ ధరలు వంటి పలు అంశాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
రైతు నాగేశ్వర్‌రెడ్డి వివరాలను తెలియజేస్తూ.. జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈసారి 1500 నుంచి 2 వేల ఎకరాల్లో రైతులు ఆలుగడ్డ సాగుచేసినట్లుగా అంచనా అన్నారు. గతంలో జ్యోతి, ఖ్యాతీ అనే విత్తన రకాలను నాటగా ఈ ప్రాంత వాతావరణానికి దిగుబడులు అంతగా రాలేదన్నారు. దీంతో 166 పోక్రాజ్ అనే విత్తనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎకరానికి 15 నుంచి 16 బస్తాల బేబీ పొటాటోలను విత్తనంగా విత్తాల్సి ఉంటుందని చెప్పారు.
ఒక మొక్క నుంచి 8 నుంచి 10 గడ్డల వరకు కాత వస్తూ బరువు సుమారు కిలో వరకు తూగుతుందన్నారు. ఎకరానికి 12 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. ఎర్ర భూముల్లో పండే దుంపలకు పది కేజీల బ్యాగుకు రూ.170 నుంచి 180 వరకు మార్కెట్ రేటు పలుకుతుండగా అదే నల్లరేగడి భూముల్లో పండే దుంపలకు పది కేజీల బ్యాగ్‌కు రూ. 200 పలుకుతున్నట్లు తెలిపారు.
కాగా ఆలుగడ్డ సాగును గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు రానున్నట్లు తెలిపారు.