ఆ చిన్నారుల కోసం సోనూ సూద్ విమానం
ఆ చిన్నారుల కోసం సోనూ సూద్ విమానం

ముంబయి: సోనూ సూద్ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు. కరోనా, లాక్డౌన్ సమాయంలో వేలాది మందికి సహాయం చేసిన సోనూ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. లాక్డౌన్ ఆంక్షలు సడలిపోయినా ఇప్పటికి ఆయన మూలంగా ఎవరో ఒకరు సహాయం పొందుతూనే ఉన్నారు. ట్విట్టర్లో ఆయనకు ఎవరు సహాయం కావాలని పోస్టు పెట్టినా వెంటనే సోనూ స్పందిస్తున్నారు. పెట్టిన ప్రతి వారికి ఏదో ఒకటి తనకు చేతనైన సాయం చేస్తునే ఉన్నారు.
తాజాగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమైన 39 మంది చిన్నారుల కోసం ఫిలిప్పీన్స్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. లివర్ సమస్యలతో బాధపడుతున్న ఈ చిన్నారులకు ఢిల్లీలో శస్త్ర చికిత్స చేయల్సి ఉంది. అయితే వారంతా ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ’రియల్ హీరో’ సోనూకు విన్నవించుకోగా ఆయన వెంటనే స్పందిచారు.
‘‘ ఈ అమూల్యమైన జీవితాలను కాపాడుదాం. మరో రెండు రోజుల్లో వాళ్లు ఇండియాకు వస్తారు. 39 ఏంజెల్స్ మీరు మీ బ్యాగులు సద్దుకోండి’’ అని సోనూ వారికి ట్విట్టర్లో సమాధానం ఇచ్చారు.
సోనూ ట్విట్‌తో మరోసారి సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.