ఆ పార్టీతో నాకు సంబంధం లేదు: హీరో విజయ్

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్త తమిళ మీడియాలో గురువారం ఉదయం నుంచి హల్‌చల్ చేసింది. విజయ్ తన పార్టీ పేరును కూడా ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించాడని, పార్టీ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నాడన్న వార్తలు ఛానళ్లలో చక్కర్లు కొట్టాయి. విజయ్ కూడా రాజకీయాల్లోకి రానుండటంతో తమిళనాడులో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని తమిళ మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకంగా విజయ్ తన పార్టీకి పేరు పెట్టుకున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై వెంటనే స్పందించాడు విజయ్. అది తనకు సంబంధించిన రాజకీయ పార్టీ కాదని.. తన తండ్రి SA చంద్రశేఖర్ స్థాపించాడని క్లారిటీ ఇచ్చాడు. ఈ రాజకీయ పార్టీతో తనకు నేరుగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదు అని కుండబద్దలు కొట్టాడు. ఈ పార్టీలో జరిగే పనుల తనకు సంబంధం లేదని.. ఏ విధంగానూ ఇందులో తాను భాగం కాలేదని తన PRO ద్వారా అఫీషియల్గా ప్రెస్ నోట్ విడుదల చేశాడు విజయ్. తన తండ్రి స్థాపించిన పార్టీ కాబట్టి అభిమానులు వెళ్లి అందులో జాయిన్ కావాలి… సేవ చేయాలని తాను చెప్పనని.. అందులో జరిగే పనులను అభిమాన సంఘాలకు సంబంధం లేదు అని తేల్చేశాడు విజయ్.
అలా కాదని ఆ రాజకీయ పార్టీతో ఎలాంటి సంబంధం లేని తను మధ్యలో ఇరికించాలని చూసినా.. ప్రచారంలో తన ఫొటోలు వాడినా కచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు విజయ్. తనకు ఇప్పుడే కాదు ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని బాంబు పేల్చాడు. రాజకీయ పార్టీ తన తండ్రిది అయినా కూడా తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ప్రెస్ నోట్ లో చెప్పుకొచ్చాడు విజయ్.
Press Release In English https://t.co/fQJlLWUaTY pic.twitter.com/zoFZOHv5LW
— RIAZ K AHMED (@RIAZtheboss) November 5, 2020