ఇండియాక‌న్నా పాక్, ఆఫ్ఘ‌న్‌లే నయం : రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌: కోవిడ్‌ను అరికట్టే విషయంలో మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కరోనాను అరికట్టే విషయంలో భారత్ కంటే పాక్, ఆఫ్గనిస్తాన్‌లే నయమని ట్విట్టర్ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు. కోవిడ్ నియంత్ర‌ణ‌లో భార‌త్ క‌న్నా పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ దేశాలు బెట‌ర్‌గా ప‌నిచేశాయ‌న్నారు. ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేసిన రాహుల్ గాంధీ.. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఐఎంఎఫ్ ఇచ్చిన అంచ‌నాల‌ను ప్ర‌స్తావించారు. ఈ ఏడాది భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 10.3 శాతం కుంచించుకుపోతుంద‌ని ఐఎంఎఫ్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. దీన్ని ప్ర‌స్తావిస్తూ బీజేపీ ప్ర‌భుత్వం అద్భుత‌మైన ఘ‌న‌త సాధించిన‌ట్లు ఆయ‌న విమ‌ర్శించారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో ‘ఘనమైన విజయాన్ని’ సాధించిందంటూ రాహుల్ విమర్శించారు. ఈ మేరకు మన పొరుగు దేశాల జీడీపీలను, మన దేశ జీడీపీని పోలుస్తూ రాహుల్ గ్రాఫ్‌ను షేర్ చేశారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్ ఇచ్చిన వృద్ధి అంచ‌నాల‌కు సంబంధించి గ్రాఫ్‌ను ఆయ‌న త‌న ట్వీట్‌లో పోస్టు చేశారు. ఆ గ్రాఫ్‌లో బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్‌, నేపాల్‌, చైనా, భూటాన్‌, పాకిస్థాన్‌, శ్రీలంక‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, ఇండియా దేశాల లెక్క‌లు ఉన్నాయి. కరోనా కారణంగా ఈ ఏడాది భారత ప్రభుత్వ రుణ భారం 17 శాతం పెరిగి జీడీపీలో 90 శాతానికి చేరవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ కేంద్రంపై విమర్శలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.