ఇండియా- చైనా యూత్‌ఫోరంలో చైనా రాయ‌బారి ప‌శ్చాత్తాపం

న్యూఢిల్లీ : గాల్వన్‌ లోయ ఘటన ‘దురదృష్టకర సంఘటన’ అని భారత్‌లోని చైనా రాయబారి సన్‌ వీడాంగ్‌ అన్నారు. ” ఇండియా – చైనా యూత్‌ ఫోరం ” నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయ‌న‌… మాట్లాడుతూ.. ‘‘సరిహద్దుల్లో ఓ దురదృష్టకర సంఘటన జరిగింది. దీనిని చైనా, భార‌త్ రెండు దేశాలు కోరుకోలేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య 70 ఏళ్ల క్రితం దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయని, అప్పటి నుండి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నామని వీడాంగ్‌ అన్నారు. ఈ కొత్త శతాబ్దంలో దౌత్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌- చైనాల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని వీడాంగ్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ను చైనా ఒక మిత్ర దేశంగా చూస్తోందని, ముప్పుగా కాకుండా అవకాశంగా భావిస్తోందని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఏ దేశమూ ఒంటరిగా అభివృద్ధి సాధించడం జరగదని, ప్రపంచీకరణ యుగంలో స్వయం సమృద్ధి సాధిస్తూనే ఇతరులకు కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

కుయుక్తులతో రెచ్చిపోతున్న డ్రాగ‌న్ దేశం కాస్త వెనుకకు తగ్గింది. గాల్వన్ లోయలో జూన్ 15న అక్రమంగా భారత సైనికులపై దాడి చేసి, తీరిగ్గా ఇప్పుడు ఈ ఘర్షణలు దురదృష్టకరమని చెప్తూ, పశ్చాత్తాపపడుతున్నట్లు మాట్లాడుతోంది. మే నుంచి చైనా దళాలు ఫింగర్ ఏరియా, గాల్వన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, కొంగ్రుంగ్ నాలా తదితర ప్రాంతాల్లో అక్రమంగా చేరిన సంగతి తెలిసిందే. జూన్ 15న భారత దళాలపై అకస్మాత్తుగా దాడి చేసి, 20 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. రెండు దేశాల మ‌ధ్య గ‌త కొంత కాలంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా అవి ఒక కొ‌లిక్కి రావ‌డం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో చైనా రాయబారి సన్‌ వీడాంగ్ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.