ఉత్త‌రాఖండ్‌లో వ‌రద బీభ‌త్సం.. 100 మందికిపైగా మృతి

చ‌మోలి: ఉత్త‌రాఖండ్‌లోని చ‌మోలి జిల్లాలో ఆదివారం ఉద‌యం నందాదేవి గ్లేసియ‌ర్ విరిగి ప‌డ‌టంతో ధౌలిగంగా న‌దిలో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించింది. ఈ వ‌ర‌దలో దాదాపు 100 మందికిపైగా మృతి చెందిన‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. అక్క‌డి రిషి గంగా ప‌వ‌ర్ ప్రాజెక్ట్‌లో ప‌ని చేస్తున్న సుమారు 150 మంది కార్మికులు ఈ వ‌ర‌ద‌లో కొట్టుకుపోయారు. వీళ్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 10 మంది మృత‌దేహాల‌ను వెలికి తీయ‌గ‌లిగారు. వంద‌ల మంది ఐటీబీపీ, ఎన్డీఆర్ఆఫ్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు. మూడు హెలికాప్ట‌ర్ల‌లో ఏరియ‌ల్ స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నారు. ఈ వ‌ర‌ద‌లో రెండు డ్యామ్‌లు కొట్టుకుపోయాయి.

దిగువ‌న డ్యామ్‌ల‌ను ఖాళీ చేయిస్తున్న అధికారులు
ఉత్తరాఖండ్‌లో నందాదేవి మంచుకొండ నుంచి హిమ‌పాతం సంభవించి వ‌ర‌దలు పోటెత్త‌డంతో ఆ రాష్ట్రం ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ముందుజాగ్ర‌త్త‌గా వ‌ర‌ద మార్గంలోని డ్యామ్‌ల‌ను ఖాళీ చేయిస్తున్న‌ది. శ్రీన‌గ‌ర్ డ్యామ్, రిషికేశ్ డ్యామ్‌ల‌ను ఇప్ప‌టికే ఖాళీ చేయించింది. ధౌలిగంగ దిగువ‌నగ‌ల అల‌క‌నంద న‌దిలోకి వ‌ర‌ద ప‌రుగులు పెడుతుండ‌టంతో అల‌క‌నంద న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అదేవిధంగా భ‌గీర‌థి నది నుంచి కూడా అల‌క‌నంద న‌దిలోకి నీటి ప్ర‌వాహాన్ని నిలిపేశారు.

ప‌రిస్థితిని స‌మీక్షించిన ప్ర‌ధాని మోడీ

ఉత్త‌రాఖండ్‌లో మంచుదిబ్బ‌లు క‌రిగి వ‌ర‌ద‌లు పోటెత్తిన ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స్పందించారు. ఇవాళ‌ అసోం ప‌ర్య‌ట‌నలో ఉన్న ఆయ‌న ఉత్త‌రాఖండ్‌లో వ‌ర‌ద‌ల గురించి తెలియ‌గానే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి త్రివేంద్రసింగ్ రావ‌త్‌, ఇత‌ర ఉన్నతాధికారుల‌తో మాట్లాడి ప‌రిస్థితిని స‌మీక్షించారు. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని ప్ర‌ధాని కార్యాల‌యం త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా
ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద‌ల‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, చీఫ్ సెక్రెట‌రీ, కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి, కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రికి ఎప్పటిక‌ప్పుడు ఫోన్ చేసి ప‌రిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
రిషిగంగ న‌దిపై బార్డర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్ (బీఆర్‌వో) నిర్మిస్తున్న ఓ వంతెన వ‌ర‌ద ప్ర‌వాహంలో కొట్టుకుపోయింది. వీటికి తోడు ధౌలిగంగ‌, అల‌క‌నంద, రిషిగంగ న‌దుల పరీవాహ‌క ప్రాంతాల్లో ప‌లు ఇండ్లు కొట్టుకుపోయాయి. 100 నుంచి 150 మంది గల్లంత‌య్యారు.
వ‌ర‌ద ప్ర‌భావిత‌ జోషిమ‌ఠ్ ఏరియాలో ఇప్ప‌టికే స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్ఎఫ్‌) బృందాలు రంగంలోకి దిగి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌ని, నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్సాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్‌) బృందాలు కూడా డెహ్రాడూన్ నుంచి జోషిమ‌ఠ్‌కు బ‌య‌లుదేరి వెళ్లాయ‌ని ఎన్‌డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్ర‌ధాన్ తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.