ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి.. ఫస్ట్‌లుక్‌ విడుదల

చెన్నై: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనారనౌత్‌ దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాగా, జయలలిత జీవితంలో కీలక వ్యక్తి అయిన ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఎంజీఆర్‌ జయంతి సందర్భంగా.. అరవిందస్వామి ఎంజీఆర్‌ పాత్రలోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఎంజీఆర్‌గా అరవిందస్వామి లుక్‌ ఆకర్షణీయంగా వుండడంతో ఈ పోస్టర్‌ వైరల్‌ అవుతోంది. ఎంజీఆర్‌ పాత్ర నేచురల్‌గా ఉండేందుకు… అరవిందస్వామి తమ ఫ్యామిలీ డెంటిస్ట్‌తో తన దంతాలను సైతం సరిచేయించుకున్నారట.! ఈ పాత్ర కోసం అరవిందస్వామి ఎంతగా కష్టపడ్డారో దీన్నిబట్టే తెలుస్తోంది. తమిళ రాజకీయాల్లో ‘మక్కల్‌ తిలగమ్‌’ (ప్రజా నాయకుడు)గా తమిళనాట ఎంజీఆర్‌ కీలక పాత్ర పోషించారు. ఎంజీఆర్‌ మరణానంతరం ఆయన రాజకీయ వారసురాలిగా జయలలిత ఏఐఏడీఎంకె పార్టీ పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఈ సినిమాలో మరో కీలక పాత్ర అయిన కరుణానిధి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఎల్‌.విజరు దర్శకత్వం వహిస్తుండగా… విష్ణు, ఇందూరి, శైలేష్‌ ఆర్‌సింగ్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.