ఎపికి ‘నివర్’ ముప్పు!
అప్రమత్తమైన అధికార యంత్రాంగం!
అమరావతి: నివర్ తుఫాన్ దూసుకొస్తుండటంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 290 కి.మీ, పాండిచ్చేరికి 300 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన తుఫాను ఈ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారు జామున కరైకల్, మహాబలిపురం వద్ద నివర్ తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ ప్రభావం కోస్తా అంతటా కనిపిస్తుంది.
నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు!
నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఎపి రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ ఉదయం నుంచే నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కావలి తుమ్మలపెంటలో సముద్రం అలజడిగా ఉంది. సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి. 10 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. జిల్లాలోని తీర ప్రాంతాల్లో సముద్ర అలల ఉధృతి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నెల్లూరు జిల్లాకు సహాయక చర్యల కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను తరలించారు. జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తుపాన్ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తుపాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
నివర్ ఎఫెక్ట్.. యూజీ, పీజీ పరీక్షలు రద్దు
నివర్ తుఫాన్ ప్రభావం వలన అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్ శశిధర్ ఓ ప్రకటన జారీ చేశారు. ఐదు జిల్లాల పరిధిలోని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కర్నూలులో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
కర్నూలు జిల్లాకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో జిల్లా ఎస్‌పి డాక్టర్ ఫక్కీరప్ప పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పుష్కరాల విధుల్లో ఉన్న పోలీసులకు పలు సూచనలు జారీ చేశారు. నదులలో అనధికారికంగా బోట్లు (పడవలు) నడుపుతుంటే వెంటనే ఆపాలని ఆదేశించారు. సిడిఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.
ప్రకాశం జిల్లాకు 30 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు..
నివర్ తుపాన్ దృష్ట్యా ప్రకాశం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దరని ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్‌లో 1077 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాకు 30 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను పంపారు. సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో అలలు తాకిడి ఉధృతంగా ఉంది. మండల ప్రత్యేక అధికారి ఎంఎల్.నరసింహారావు పాకల సముద్ర తీరంలో పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.