ఎపిలో కొత్తగా 6,582 కరోనా కేసులు
అమరావతి: దేశంలో కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తుంది. పలురాష్ట్రాల్లో ఈ మహమ్మారి కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో 35,922 కొవిడ్ నిర్ధారణ పరీక్ష జరుపగా 6,582 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఎపి వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,62,037 మంది వైరస్ బారిన పడ్డారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో 2,343 మంది కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 9,09,941కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44, 686 యాక్టివ్ కేసులున్నాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల 22 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాల వారీగా చూస్తే… చిత్తూరులో ఐదుగురు, కృష్ణా, నెల్లూరులో నలుగురు చొప్పున, కర్నూల్లో ముగ్గురు, అనంతపురం, గుంటూరులో ఇద్ధరేసి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 7,410కి చేరింది.
ఎపిలో అత్యధికంగా చిత్తూరులో 1,171, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 82 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో గత మూడు రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి.