ఎ.వి.వి ప్రసాద్: ఎస్పీకి భారతరత్న లభిస్తుందా!

మహా గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. సెప్టెంబరు చివరలో ఆయన స్వర్గస్తులైన తర్వాత అంత్యక్రియలకు హాజరైన ప్రముఖ తమిళ నటుడు అర్జున్ తొలుత ఈ డిమాండ్ చేశారు. తర్వాత జాతీయ తమిళ నటుడు కమల్ హాసన్ కూడా అదే డిమాండ్ చేశారు. ఆ తరువాత మరికొందరు సినీ ప్రముఖులు కూడా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లన్నీ చాలా వరకు తమిళ రంగం నుండి వచ్చినవే. ఎపి సి.ఎం జగన్ ఆ తర్వాత ప్రధాన మంత్రికి ఇదే డిమాండ్ తో ఒక లేఖ రాశారు. ఇవన్నీ హర్షించదగినవే. ఎంతటి ప్రముఖ వ్యక్తి కైనా భారత రత్న వంటి దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించాలంటే.. ఇలాంటి డిమాండ్లు చేసినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పటికి ఏదో సంతృప్తి లభిస్తుంది తప్ప ఫలితం మాత్రం దక్కదు. ఫలితం లభించాలంటే అసలైన కృషి జరగవలసి ఉంటుంది.

ప్రస్తుతం మరో ఇద్దరు తెలుగు ప్రముఖులు కూడా భారతరత్న కోసం క్యూలో ఉన్నారు. వారు .. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు , మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్.టి రామారావు. వీరిలో ఎన్టీయార్ కు ఇవ్వాలని దాదాపు 20 యేళ్లనుండి , పి.వి కి ఇవ్వాలని 15 సంవత్సరాల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారిద్దరి విషయంలోను చాలామంది గట్టిగానే డిమాండ్ చేశారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత పివికి ఇవ్వాలనే డిమాండ్ ను తెలంగాణ లోని కెసిఆర్ ప్రభుత్వం సొంతం చేసుకుని ఇటీవల అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా ఆమోదించింది. కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. అయితే ఎపిలో ఎన్టీయార్ విషయంలో ఇలాంటి ప్రయత్నమేదీ జరుగలేదు. తెలుగు దేశం పార్టి మహానాడులో ఎన్టీయార్ కు భారతరత్న డిమాండ్ చేయడమే గాని , ఆపార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా అసెంబ్లీలో తీర్మానం చేయలేదు. ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నది గనుక అలాంటి తీర్మానం చేస్తుందని ఊహించలేం. ఎస్పీకి ఇవ్వాలని జగన్ డిమాండ్ చేయడాన్ని బట్టి ఆయన వైఖరి స్పష్టమవుతున్నది గనుక ఎన్టీయార్ కు ఇప్పట్లో ఆ పురస్కారం రాగలదని చెప్పడం కష్టం. అలాగే ఎస్పీ విషయం కూడా. సిఎంగా జగన్ లేఖ రాశారు తప్ప మళ్లీ ఆవిషయంపై ఏమీ మాట్లాడలేదు.

తెలుగు సినిమా రంగంనుంచి కూడా పెద్దగా మళ్లీ ఎవరూ మాట్లాడలేదు. అభిమానుల నుంచి వినిపించే డిమాండ్ రాజకీయ పెద్దలనుంచి గాని , టాలీవుడ్ ప్రముఖుల నుంచి గాని వినిపించడంలేదు. అందువల్ల ఎస్పీకి ఇవ్వాలనుకున్నా అది ఆలస్యం కావచ్చు. ఆయన 16 భాషలలో 46 వేలుపైగా పాటలు పాడి జగద్విఖ్యాతుడైన మాట నిజమే. కాని భారతరత్న లభించాలంటే చాలా పొలిటికల్ ప్రాసెస్ జరగవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన తర్వాత ఆ తీర్మానాన్ని ప్రధాన మంత్రి పరిశీలించి రాష్ట్ర పతికి నివేదించవలసి ఉంటుంది. ఆ తర్వాతే ప్రకటన వెలువడుతుంది. ఈ మధ్యలో ఎంతకాలమైనా పట్టవచ్చు. అది ప్రభుత్వం చేసే ప్రయత్నం పై ఆధారపడి ఉంటుంది. పివికి ఇవ్వాలనే అంశాన్ని చూస్తే, ఆవిషయంలో కెసిఆర్ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తోంది. దేశానికి ఆర్థిక సంస్కరణలతో ఒక దశ , దిశ చూపిన నేతగా తెలుగు ప్రజలే గాక , దేశ ప్రజలందరి అభిమానం చూరగొన్న గొప్ప నాయకుడు పివి. మోడీ ప్రభుత్వానికి కూడా.. పివికి భారతరత్న ఇస్తే ఎన్నికల సమయంలో ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుందనుకోవచ్చు. అందువల్ల కేంద్రం దానిని కూడా పరిగణనలోకి తీసుకుంటుందనిపిస్తుంది. ఈ ముగ్గురిలో.. తెలుగు వారెవరికైనా భారతరత్న ఇవ్వాలని కేంద్రం అనుకుంటే అది పివికే అవుతుందనడంలో సందేహంలేదు.

పివికి ఇచ్చినా‌ , రెండు తెలుగు రాష్ట్రాల లోని వారు ఆనందిస్తారనే చెప్పాలి.

కానీ.. 1954లో భారతరత్న పురస్కారం ప్రారంభించిన తర్వాత తెలుగు రాష్ట్రం నుండి ఒక్కరికీ ఇంతవరకు లభించనేలేదు. తెలుగు వారే అయినా.. డా. సర్వేపల్లి రాధాకృష్ణ కు తమిళనాడు కేటగిరీ నుంచి , వివి గిరికి ఒరిస్సా కేటగిరీ నుంచి , అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో జన్మించిన జాకిర్ హుస్సేన్ కు ఢిల్లీ కేటగిరీ నుంచి భారత రత్న లభించింది. అంటే ఇంతవరకూ ఎపి కేటగిరీ నుంచి ఒక్కరికి కూడా లభించనట్లే కదా! ఈ పరిస్థితి లో పివికి ఇచ్చినా.. అది తెలంగాణ కేటగిరీ కింద కు వస్తుంది. ఎపి లో ఎవరికివ్వాలనేది ప్రశ్నార్ధకం గానే మిగిలిపోతుంది. ఎపిలో ఎవరికైనా ఆ అత్యున్నత పురస్కారం రావాలంటే.. తొలుత రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మరి ఆ ప్రయత్నం జరుగుతుందా! వేచి చూడాలి.

-ఎ.వి.వి ప్రసాద్
సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.