ఏజన్సీ ప్రాంతాల్లో డిజిటల్ తరగతులు..

ములుగు జిల్లా సమీక్షా సమావేశంలో: రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

ములుగు: ఏజన్సీ ప్రాంతాలలో డిజిటల్ తరగతులు అందరికీ చేరే విధంగా చూడాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల ములుగు జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాలు, ముంపు ప్రాంతాలలో బుధవారం పర్యటించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వర్షం వల్ల రోడ్లు, పంటలు, వ్యక్తిగత ఆస్తుల నష్టాన్ని అంచనావేసి త్వరలోనే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలోని ఇబ్బందులను ముఖ్యమంత్రి కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు వచ్చాయని, ఉమ్మడి వరంగల్ జిల్లా బాగా దెబ్బతిన్నదని, రామప్ప కూడా దెబ్బతిన్నదని అన్నారు. దాదాపు వారం రోజులు వర్షాలు వచ్చి, వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు, కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు పనిచేశారని, పనిచేసిన వారందరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. దురదృష్టవశాత్తు ఇద్దరు యువకులు చనిపోయారని, చాలా విచారకరమని అన్నారు. రోడ్లు బాగా పాడయ్యాయని, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా ఏజన్సీలతో నష్టం అంచనా వేస్తున్నామన్నారు. దీంతో పాటు వెంటనే చేపట్టే తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాశ్వత ప్రాతిపాదికన భవిష్యత్ లో మరోసారి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరి నష్టపోయిందని, దీనిని అంచనా వేసి పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు సమగ్రమైన నివేదికను ఇప్పటికే తయారుచేశారని, సిఎం కేసిఆర్ గారి ఆమోదంతో చర్యలు తీసుకుంటామని అన్నారు. కోవిడ్ -19 నేపథ్యంలో వైద్యులు, పోలీసులు, ఇతర శాఖలు, ప్రజా ప్రతినిధులు వారి, వారి పనులు బాగా చేశారన్నారు.
ములుగులో ఎక్కువగా గిరిజన ప్రజలున్నారని, ఈ వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున, పటిష్టంగా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల ఒకటో తారీఖు నుండి డిజిటల్ తరగతులు ప్రారంభించామన్నారు. ఇందుకోసం నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు అందించామని, ఏజన్సీ ప్రాంతాలలో డిజిటల్ తరగతులు అందరికీ చేరే విధంగా చూడాలన్నారు. అంగన్ వాడీ కేంద్రాలలో పిల్లల ఎత్తు, బరువు ఎప్పటికప్పుడు నమోదు చేసి తగిన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ మాసాన్ని పోషన్ అభియాన్ మాసంగా పాటిస్తున్నామని, ఈ నెలలో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి మంచి ఆహారం అందించేందుకు కేంద్రాలలో కిచెన్ గార్డెన్స్ పెంచాలన్నారు. ఆకుకూరలు, కరివేపాకు, మునక్కాయలు వంటివి పెంచితే పిల్లలకు ఉపయోగపడుతాయన్నారు.
ఈ సంవత్సరం కొత్తగా అంగన్వాడి కేంద్ర భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రస్తుతం పాత భవనాలలో నడుస్తున్న కేంద్రాలు, ప్రైవేట్ భవనాలు, దాతల సహకారంతో నడుస్తున్న భవనాలను గుర్తించి, నివేదిక పంపితే కొత్త భవనాలు మంజూరు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొన్నింటికి కరెంటు లేదని, మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంటు లేదని, కరెంటు లేనిచోట, త్రిఫేజ్ కరెంటు లేనివాళ్లకు త్వరలోనే త్రిఫేజ్ కరెంటు ఇవ్వనున్నామన్నారు. రాష్ట్రంలో కేవలం 23శాతం మాత్రమే అటవీ ప్రాంతమున్నదని, దీనిని 33 శాతానికి పెంచాలని సిఎం కేసిఆర్ గారు సంకల్పించారన్నారు. హరితహారంలో ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా ఈ అటవీ ప్రాంతాన్ని పెంచాలన్నారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో అడవిని కాపాడుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, పీవో ఐటీడీఏ హన్మంతు కె జండగే, ఏఎస్పీలు సాయి చైతన్య, శరత్ చంద్ర పవార్, జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి, డీఆర్డీవో ఏ. పారిజాతం, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు పల్లె బుచ్చయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.