ఏజెన్సీలో టెన్షన్ టెన్షన్

కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉలిక్కిపడింది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. దీంతో ఇక్కడి ఏజెన్సీ ప్రాంతంలో టెన్సన్ వాతావరణం నెలకొంది. గత కొంత కాలంగా మావోల ఏరివేతపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసుశాఖ అటవీ ప్రాంతాల్లో వరుస కూంబింగులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే చర్ల-చత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే పోలీసులు ఎన్‌కౌంటర్ జరపడం గమనార్హం. చర్ల మండలంలోని వడ్డిపేట, పుస్సుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పరిశీలించారు. మృతుల్లో ఒకరు శ్రీనివాస్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో బ్యారెల్ గన్, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో పోలీసులు మోహరించారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ దూది దేవాలు అలియాస్ శంకర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన రహదారుల మీద దృష్టి కేంద్రీకరించిన పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. మావోయిస్టు బంద్ దృష్ట్యా ఏజెన్సీలో ప్రత్యేక బలగాలను మోహరింపజేసి కూంబింగ్ చేపట్టారు. స్పెషల్ పార్టీ బలగాలతో పాటు ఈ దఫా గ్రేహౌండ్స్ దళాలతో సరిహద్దు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే చర్ల మండలంలో తాజా ఎన్‌కౌంటర్ జరిపారు. తాజా ఎన్‌కౌంటర్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో టెన్సన్ వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.