TS: బంగారు వాసాలమర్రి కావాలి: ముఖ్యమంత్రి కెసిఆర్

వాసాలమర్రి (CLiC2NEWS)): ఏడాది తిరిగే సరికి గ్రామం బంగారు వాసాలమర్రి కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసామర్రిలో మంగళవారం సిఎం పర్యటించారు. ఇవాళ గ్రామం చేరుకున్న సిఎంకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తుతో కలిసి సిఎం సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.
`రాష్ట్ర సర్కార్ వాసాలమర్రికి అండగా ఉంటుంది. చుట్టు పక్కల గ్రామాలకు వాసాలమర్రి ఆదర్శంగా నిలవాలి. మనమంతాకలిసికట్టుగా అనుకున్నది సాధించాలి. ఈ ఊరికి కనీసం తాను ఇంకో 20 సార్లు వస్తాను. వచ్చేసారి ఇలా సభ పెట్టను. మీ ఊరిలో నలుగురు మాత్రమే పరిచయం అయ్యారు. ఊరందరూ పరిచయం అయ్యేలా సభ పెట్టాలి. అందరం పట్టుబడితే వాసాలమర్రి ఏడాది నాటికి బంగారు వాసాలమర్రి కావాలి. ఊరిలో పోలీసు కేసులు లేకుండా చూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని పనులు జరగాలి. ఇవన్నీ సాధ్యమైతే వందకు వంద శాతం వాసాలమర్రి బంగారంలా తయారవుతుంది.
ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 421 గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాను. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు కూడా నిధులు మంజూరు చేస్తాను. భువనగిరి మున్సిపాలిటికీ రూ. కోటి, మిగతా ఐదు మున్సిపాలిటీలకు రూ. 50 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

వాసాలమర్రి గ్రామస్తులతో ముఖ్యమంత్రి సహపంక్తి భోజనం
వాసాలమర్రి గ్రామస్తులతో కలిసి సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. ఇక భోజనం చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భోజనాలు ఎలా ఉన్నాయని అడిగారు. గ్రామంలోని 3 వేల మందికి ఒకేసారి భోజన ఏర్పాట్లు చేశారు. వాసాలమర్రిలోని కోదండ రామాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
23 రకాల వంటకాలతో భోజనం ఏర్పాటు…
వాసాలమర్రి గ్రామస్తులకు 23 వంటకాలను వడ్డించారు. మటన్, చికెన్, ఆకుకూరలు, బోటీ కర్రి, చేపలు, తలకాయ కూర, కోడిగుడ్డు, రెండు రకాల స్వీట్లు, పాలక్ పన్నీరు, బిర్యానీ, పులిహోర, సాంబార్, పండ్ల రసాలు, ఆలుగడ్డతో పాటు పలు వైరెటీలు చేశారు.