ఐపీఎల్ షెడ్యూలు వచ్చేసింది..
దుబాయ్: క‌్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అలని ఎదురుచూస్తున్న ఐపిఎల్ 2020 ని బిసిసిఐ విడుదల చేసింది. దీందో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ఏటా పాటించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సీజన్‌ను కూడా గత ఏడాది ఫైనలిస్టులతోనే ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించింది.
ఈ నెల 19న అబుదాబిలో డిఫెండింగ్ చాంపియన్స్ అయిన రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు, ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. రెండో మ్యాచ్ 20న దుబాయ్‌లో ఢిల్లీ కేపిటల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరగనుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 21 దుబాయ్‌లో, రాజస్థాన్ రాయల్స్-సీఎస్‌కే జట్లు 22న షార్జాలో తలపడనున్నాయి. నవంబరు 7న క్వాలిఫయర్-1, నవంబరు 8న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబరు 9న క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుండగా, 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్‌లో 24, షార్జాలో 20, అబుదాబిలో 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
తొలుత ఈ సీజన్ మార్చి 29నే ముంబయిలో ప్రారంభం కావాల్సి ఉండగా, అప్పుడు భారత్‌లో కరోనా కేసులు ఆరంభ దశలోనే ఉన్నాయి. అదే సమయంలో లాక్‌డౌన్ విధించడంతో టోర్నీ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి-20 వరల్డ్ కప్ వాయిదాపడడంతో బిసిసి ఆ సమయాన్ని ఇలా వాడుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే యుఎయిని సంప్రదించి అన్ని ఏర్పాట్లూ చేసింది.