ఓరుగల్లు అతలాకుతలం
ఓరుగల్లు అతలాకుతలం
పలు కాలనీలు జలమయం
చెరువును తలపిస్తున్న రహదారులు
వరంగల్ : అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. జోరుగా కురుస్తన్న వానలతో పలు కాలనీలు నీట మునిగాయి. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
వరంగల్ మహానగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కాలనీలన్నీ జలమయమయ్యాయి. హన్మకొండ నయీంనగర్ దగ్గర ‘నాలా’పొంగడం.. చింతగట్టు దగ్గర రోడ్డు పైన నీళ్లు వెళ్లడంతో కరీంనగర్ రహదారి వైపు రాకపోకలు నిలిచాయి. ఖిలా వరంగల్ పరిధిలోని ఉర్సు బీఆర్ నగర్ నీట మునిగింది. దాదాపు 500 ఇళ్లలోకి నీరు చేరింది. గిర్మాజీపేట, శివనగర్ అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు ముంచెత్తడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. హన్మకొండలోని అంబేద్కర్ నగర్, కాకతీయ కాలనీ వడ్డెర వీధి ముంపునకు గురయ్యాయి. నగరంలోని ములుగు రోడ్డు వద్ద ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సమ్మయ్యనగర్ పూర్తిగా మునిగిపోవడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోపాలపురం చెరువు ప్రమాదకరంగా మారింది. పైగా చెరువుకు గండి పడే అవకాశం ఉన్నట్లుగా తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, సమ్మయ్య నగర్, మైసమ్మ నగర్, సందరయ్య నగర్, లోతుకుంట వీవర్్స కాలనీ, ఎస్సార్ నగర్ ఇళ్లలోని వర్షపు నీరు చేరడంతో కాలనీవాసలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు కాలనీలు, గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రామప్ప, పాకాల, లక్నవరం సహా చెరువులు, కుంటలు మత్తళ్లు దుముకుతుండగా, జంపన్నవాగు, చలివాగు, మోరంచ, కటాక్షపురం వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 421 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేడారం సమీపంలోని జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మారుమూల ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. చరిత్రలో మొదటిసారిగా జంపన్నవాగు పొంగిపొర్లిందని చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చలివాగు ప్రమాదకర స్థాయికి చేరింది. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పిత్తి నిలిచిపోయింది.