కరోనాతో కేంద్ర మంత్రి కన్నుమూత

న్యూఢిల్లీ: రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్‌ అంగడి కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు. ఢిల్లీ ఎయిమ్స్‌లో కరోనా చికిత్స పొందుతూ ఆయని మరణించారు. 12 రోజులుగా కరోనా చికిత్స పొందారు. కరోనా సోకిందని ఈ నెల 11న స్వయంగా ఆయనే ట్వీట్‌ చేశారు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సురేశ్‌ అంగడి 2000-2004 మధ్య కాలంలో బెల్గాం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. బెల్గాం జిల్లాలోని కేకే కొప్పా ఆయన స్వస్థలం. సురేశ్‌ తల్లిదండ్రులు సోమవ్వ, చెన్నబసప్ప. సురేశ్‌ భార్య పేరు మంగల్‌. ఆయనకు ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శారద ఉన్నారు.

కర్ణాటకలో కరోనా బారిన పడి మరణించిన బీజేపీ రెండో ఎంపీ సురేష్‌ అంగడి. రాజ్యసభ సభ్యుడు, కర్ణాటక బీజేపీ నాయకుడు అశోక్‌ గస్తీ(55) ఈ నెల 17న బెంగళూరులో కన్నుమూశారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు నాయకులు ప్రాణాలు కోల్పోవడం బీజేపీ శ్రేణులను తీవ్ర వేదనకు గురిచేసింది. సురేష్ అంగడి హఠాన్మరణం పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా, కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు.
సురేశ్‌ మరణం బాధాకరం: ప్రధాని
సురేశ్‌ అంగడి మరణంతో నిబద్ధత కలిగిన కార్యకర్తను పార్టీ కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ సంతాప సందేశంలో పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన చాలా కృషి చేశారని తెలిపారు. ఎంపీగా, మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. సురేశ్‌ అంగడి మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.