కరోనాతో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కన్నుమూత
చెన్నై: కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా బల్లి దుర్గాప్రసాద్‌కు తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్ మరణంతో ఆయనకుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన.. 2019లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన బల్లి దుర్గాప్రసాద్.. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996-98లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా, 2009-14లో పీఏసీ మెంబర్‌గా సేవలు అందించారు. అనంతరం 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు.
సీఎం జగన్ సంతాపం
బల్లి దుర్గాప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ కుమారుడితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్.. ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణం బాధాకరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి అభివృద్ధిలో ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ చెదరని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తు సంతాపం ప్రకటించారు. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, నెల్లూరు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.