కరోనా టెస్ట్ రేట్లని తగ్గించిన ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణాలో కరోనా మహమ్మారి కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ప్రైవేటు ల్యాబ్స్ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు తెలంగాణా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నిర్ధారణకు ప్రామాణికమైన టెస్టు ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు తెలంగాణలో ప్రస్తుతం ల్యాబ్స్ రూ.2200 వసూలు చేస్తున్నాయి. ఇకపై రూ.850కు మించి చార్జ్ చేయకూడదని ఆదేశించింది ప్రభుత్వం. అయితే ఇంటి నుంచి శాంపిల్స్ సేకరించి, టెస్టులు చేస్తే.. వారి నుంచి రూ.1200 వరకు చార్జ్ చేయొచ్చని తెలిపింది. ఇప్పటి దాకా 2800 రూపాయలకి ఈ శాంపిల్స్ కలెక్ట్ చేసుకునే వారు. ప్రభుత్వం సూచించిన గరిష్ఠ ధరలకు మించి ఎక్కువగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఆయా ప్రైవేటు ల్యాబ్స్, ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణా ఆరోగ్య శాఖ పేర్కొంది.
కాగా తాజా కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా తెలంగాణలో 948 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఐదు మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,59,776కి చేరింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1415కి చేరింది. ఇక 2,45,293 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,068 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 1607 మంది నిన్నటి రోజున కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.