కరోనా బాధితులకు శుభవార్త.. వచ్చే వారం అందుబాటులోకి Drug 2-DG

న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత రక్షణ సంస్థ డీఆర్డీఓ భాగస్వామ్యంతో కొవిడ్ బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది. పౌడర్ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను ఈవారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ, డీఆర్డీఓ అధికారులు సంయుక్తంగా వెల్లడించారు. వాటిని కరోనా బాధితులకు ఇవ్వనున్నట్లు తెలిపారు.
2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఉత్పత్తి హైదరాబాద్ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభం కానుంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. 2-డీజీ ఔషధ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులపై బాగా పనిచేస్తుందని, కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ ఔషధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని డీఆర్డీఓ పేర్కొంది. జెనరిక్ మాలిక్యూల్, గ్లూకోజ్ అనలాగ్ కావడం వల్ల దీని ఉత్పత్తి చాలా సులువని చెప్పింది. కావున ఇది పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. దీన్ని ఉపయోగించిన బాధితుల్లో చాలా మందికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలోనెగెటివ్‌గా తేలినట్లు డీఆర్‌డీఓ డీసీజీఐకి సమర్పించిన పత్రాల్లో తెలిపింది. పొడి రూపంలో డ్రగ్‌ను నీళ్లలో కలుపుకొని తాగితే వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ వివరించింది.