కరోనా మహమ్మారే చివరిది కాదు : డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్

జెనీవా : కరోనా వైరస్ చివరి మహమ్మారే కాదని, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉపద్రవాల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రాయాసిస్ హెచ్చరించారు. వాతావరణ మార్పులు, పశు సంరక్షణను సరిగా నిర్వహించకపోతే మానవ ఆరోగ్య మెరగు కోసం చేపడుతున్న చర్యలు వృథాయే అవుతాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఓ వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. చాలా కాలం నుండి ప్రపంచం నిర్లక్ష్యం, భయాందోళనలనే చట్రంలో ఇరుక్కుపోయిందని వ్యాఖ్యానించారు. వైరస్ వ్యాప్తి చెందే సమయంలో డబ్బులు ఖర్చు చేస్తామని, తర్వాత దాని సంగతే మర్చిపోతామని, అనంతరం ఆ వైరస్ నిరోధించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుమని, ఇటువంటి నిర్లక్ష్యమైన చిన్న చూపు మంచిది కాదని సూచించారు. కరోనా మహమ్మారి చివరిది కాదని, ఇంకా అంటు వ్యాధులు పుట్టుకొస్తాయని చరిత్ర చెబుతుందని అన్నారు. ఈ కరోనా వైరస్ మానవుల ఆరోగ్యం, జంతువులు, గ్రహల మధ్య సన్నిహిత సంబంధాలను ఎత్తి చూపిందని తెలిపారు.
గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో తొలి కేసు నమోదు అయినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 1.75 మిలియన్ల మంది ప్రజలు మృత్యువాత పడగా, 80 మిలియన్ల కేసులు భయపడ్డాయి. గత సంవత్సరంలో ప్రపంచమంతా తలకిందులైందని, మహమ్మారి ప్రభావమనేది వ్యాధిని మించిపోతుందని పేర్కొన్నారు. కరోనా పదేపదే హెచ్చరికలు ఇచ్చినట్లయితే…ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, మహమ్మారి మనకు బోధిస్తున్న పాఠాలను నుండి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.