కానిస్టేబుల్‌ చేతిలో మాజీ డిజిపికి పరాభవం!

పాట్నా : బీహార్ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పోలీస్‌ మాజీ డిజిపి గుప్తేశ్వర్‌ పాండేకు నిరాశే ఎదురైంది. ఈ మ‌ధ్య కాలంలో అత్యున్నత పదవికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచిన పోలీస్‌ మాజీ డిజిపి గుప్తేశ్వర్‌ పాండేకు బీహార్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ద‌క్క‌లేదు. దాంతో ఆయ‌న ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ యునైటెడ్‌ తరుపున ఆయన సొంత జిల్లా అయిన బుక్సర్‌ నుండి పోటీ చేయాలని ఎంతో ఆసక్తి కనబర్చారు. కానీ ఇప్పుడు ఆ స్థానం అధికార కూటమిలోని బిజెపి ఖాతాలో చేరిపోవడంతో గుప్తేశ్వర్‌ ఆశలు అడియాశలయ్యాయి. అందులోనూ మాజీ కానిస్టేబుల్‌ పరుశురామ్‌ చతుర్వేదికి అవకాశం దక్కడంతో మరింత నిరాశకు గురయ్యారని సమాచారం. మాజీ డిజిపి తనకు పెద్దన్నతో సమానమని, ఆయనపై ఆప్యాయత తప్ప తనకు కోపతాపలేమీ లేవంటూ… పరుశురామ్‌ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్‌ పోలీసు శాఖలో ..క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సిఐడి)తో సహా పలు విభాగాల్లో పనిచేశానని, తాను పనిచేసిన ప్రతిచోటా.. తనకు గౌరవిచ్చారని.. తాను చిత్తశుద్ధితో పనిచేశానని, అదే ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి సాయపడిందని చతుర్వేదీ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే గుప్తేశ్వర్‌ పాండే గత నెలలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. జెడియులో చేరారు. కాగా, ఈ నెల 28న తొలి విడత ఎన్నికలు జరుగుతున్న 11 నియోజకవర్గాలకు సంబంధించి జెడియు అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. గుప్తేశ్వర్‌ పేరు గల్లంతయ్యింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో జోరుగా దర్యాప్తు చేపట్టడంలో కీలక పాత్ర పోషించినందుకు.. ప్రభుత్వం మెచ్చి..తనకు మంచి బహుమతి ఇస్తుందని భావించిన గుప్తేశ్వర్‌ పరిస్థితి… రెండింటికీ చెడ్డ రేవడి చందంగా తయారయింది.

Leave A Reply

Your email address will not be published.