కుటుంబ నియంత్రణపై బలవంతం చేయలేం: కేంద్రం

న్యూఢిల్లీ : కుటుంబ నియంత్రణపై దేశ ప్రజలను బలవంతం చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు ఒక జంట నిర్ధిష్ట సంఖ్యలో మాత్రమే పిల్లలను కలిగి ఉండాలని బలవంతం చేసేందుకు ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని పేర్కొంది. ఒకవేళ సంతానంపై నిబంధనలు పెడితే అది ప్రజల్లో తీవ్ర నిరసనలకు దారితీసే ప్రమాదం ఉందని, అంతర్జాతీయ అనుభవాలు కూడా ఇదే చెబుతున్నాయని అభిప్రాయపడింది. ఈ మేరకు జనాభా నియంత్రణపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం శనివారం తన అఫిడవిట్ సమర్పించింది. దేశంలో కుటుంబ సంక్షేమ పథకం స్వచ్ఛందమైనదని, పిల్లలు ఎంత మంది కావాలో లేదా కుటుంబ నియంత్రణకు అనుసరించాల్సిన తమకు అనుకూలమైన పద్ధతులపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని దంపతులకు అది కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా దంపతుల ఐచ్ఛికమని, ఇందులో బలవంతం లేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తన అఫిడవిట్‌లో పేర్కొంది.