కేంద్రమంత్రి పదవికి హర్‌సిమ్రత్ రాజీనామా

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లు ఎన్‌డిఎ కూట‌మిలో చిచ్చు పెట్టేలా క‌నిపిస్తోంది. ఈ బిల్లును వ్య‌తిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షమైన శిరోమణీ అకాలీదళ్ స‌భ్యురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని కార్యాలయానికి చేరుకొని హర్‌ సిమ్రత్‌ రాజీనామా సమర్పించారు. ఇప్పటికే వ్యవసాయ బిల్లులపై ఎన్డీయేకు తనవైఖరిని అకాలీదళ్‌ స్పష్టం చేసింది.

రైతులకు, వ్యవసాయానికి సంబంధించిన బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంతో ఆకాలీదళ్ విభేదించింది. లోక్‌సభలో జరుగుతున్న చర్చల సందర్భంగా తమ నిరసన కూడా ఆ పార్టీ నేత సుఖబీర్ బాదల్ తెలియజేశారు. ఈ విధ‌మైన అభిప్రాయాన్ని ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా వ్య‌క్తం చేయ‌ని అకాలీద‌ళ్ పార్టీ లోక్ స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా లేవ‌నెత్త‌డం ప్ర‌భుత్వాన్ని కొంత ఇబ్బందికి గురిచేసిన‌ట్లైంది. ఇక రెండు వ్యవసాయ బిల్లులకు సంబంధించి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని అకాలీదళ్‌ నిర్ణయించింది. బిల్లులకు నిరసనగా మంత్రి పదవులు వదులుకోవాలని కూడా నిర్ణయించింది. త‌న రాజీనామాను ప్ర‌ధాని కార్యాల‌యంలో స‌మ‌ర్పించిన అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానానికి వ్య‌తిరేకంగానే తానీ నిర్ణ‌యం తీసుకున్న‌టు తెలిపారు. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినా ఎన్డీయేలోనే కొనసాగాలనుకుంటున్నట్లు సమాచారం.

గతంలో అకాలీదళ్ అధ్యక్షుడిగా, పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ భార్యే హర్‌సిమ్రత్ కౌర్. 2009లో ఆమె రాజకీయాల్లోకి రాగా అప్పటి నుంచి 3సార్లు భటిండా లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. మోదీ ప్రభుత్వంలో రెండోసారి కేబినెట్ మంత్రి పదవి చేపట్టారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఎన్ డి ఎ కూట‌మిలో ప్ర‌ధాన భాగ‌స్వామిగా ఉన్న అకాలీద‌ళ్ పార్టీ స‌భ్యురాలు రాజీనామా నిర్ణ‌యంతో బిజెపి ఒక్క‌సారి ఉలిక్కి ప‌డింది. చూడాలి మ‌రి కేంద్రం వ్య‌వ‌సాయ బిల్లుపై ఏం నిర్ణ‌యం తీసుకంటుందో.!

Leave A Reply

Your email address will not be published.