కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత రాం విలాస్ పాశ్వాన్ (74) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. ఆయన వయసు 74 సంవత్సరాలు. రాంవిలాస్ పాశ్వాన్ 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మృతికి కారణం గుండెపోటుగా తెలిసింది. ప్రధాని మోదీ కేబినెట్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా రాం విలాస్ పాశ్వాన్ కొనసాగుతున్నారు. దేశంలోని కీలక దళిత నేతల్లో పాశ్వాన్ ఒకరు. పాశ్వాన్ ఇక లేరనే వార్తతో ఎల్‌జేపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.
పాశ్వాన్ ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నారు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తరువాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభ తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగున్నారు. మొత్తం ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1946 జూలై 5న బిహార్‌లో జన్మించిన పాశ్వాన్.. 2000లో లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. కాగా రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ః కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణంతో దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయింది. పార్లమెంటులో అత్యంత చురుకైన మరియు ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నా.
ప్రధాని నరేంద్ర మోడీః రామ్‌విలాస్ పాశ్వాన్ ఇక లేరన్న వార్త నన్ను దిగ్ర్బాంతికి గురిచేసింది. పాశ్వాన్ మృతితో ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. పేదల కోసం అహర్నిశలు శ్రమించారు. తాను ఓ మంచి స్నేహితుడిని, సహచరుడిని పేదల కోసం ఆలోచించే వ్యక్తిని కోల్పోయాను.
రాహుల్ గాంధీః రామ్ విలాస్ పాశ్వాన్ జీ అకాల మరణం బాధాకరం. పేదలు, అణగారిన వర్గాలు ఆయన మృతితో ఈ రోజు ఒక బలమైన రాజకీయ గొంతును కోల్పోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం ప్రకటిస్తున్నాను.
సిఎం కేసీఆర్ః తెలంగాణ ఉద్యమ సమయంలో పాసవాన్ అండగా నిలిచారు. రాజకీయ నాయకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా పాసవాన్‌కు భారత రాజకీయ చరిత్రలో గొప్పస్థానం ఉంది. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం.
Union Minister and LJP leader Ram Vilas Paswan passes away, tweets his son Chirag Paswan. pic.twitter.com/YQi5oNHz8Q
— ANI (@ANI) October 8, 2020